రాప్తాడు నియోజకవర్గ ఓపీవోల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఫాం (13ఏ)పై ఆథరైజేషన్ అధికారి ముద్ర లేకుండానే ఓట్లు వేయించారని ఆందోళన చేపట్టారు. పోలింగ్ కేంద్రంలోని ఆథరైజేషన్ అధికారి సాయంత్రం వరకు అందుబాటులో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పీవో, ఓపీవో స్థాయి అధికారులకు పోలింగ్ చేపట్టారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. సాయంత్రం 5 వరకు పోలింగ్ మొదలు పెట్టలేదు. అప్పటికి కూడా ఆథరైజేషన్ అధికారిగా ఉన్న చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోలేదు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాప్తాడు తహసీల్దార్ మాత్రం అక్కడే విధుల్లో ఉన్నా మరో గెజిటెడ్ అధికారితో ఫాం-13ఏ పై సంతకాలు చేయించి ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. ఇలా 8 మంది ఓట్లు వేసిన తర్వాత 13ఏ ఫాంపై అధికారి ముద్ర లేదని ఉద్యోగులు గుర్తించారు. రాప్తాడు తహసీల్దార్ కావాలనే కుట్ర చేశారని ఆరోపించారు. ఆథరైజేషన్ అధికారి ముద్ర లేకుండా వేసిన ఓట్లపై సమాధానం చెప్పాలంటూ ధర్నాకు దిగారు. ముద్ర వేయకపోయినా కొంపలేం మునగలేదంటూ అంటూ ఆర్‌వో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ శివారెడ్డి ఉద్యోగులకు సర్ది చెప్పారు.
source : eenadu.net
Discussion about this post