ఐదేళ్ల వైసిపి పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, కర్నూలుకు న్యాయరాజధాని ఏమైందని టిడిపి అధినేత నారా చంద్రబాబు ప్రశ్నించారు. మద్యం, ఇసుకలో సంపాదించిన డబ్బులతో ఓట్లను కొనాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆయనను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. తాము అధికారంలోకొస్తే పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రజాగళం’ పేరుతో నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. కర్నూలుకు న్యాయ రాజధాని ఎందుకు రాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. టిడిపి హయాంలో ఓర్వకల్లులో పరిశ్రమల హబ్ కోసం, నందికొట్కూరు మండలం తంగడంచ వద్ద మెగా సీడ్స్ హబ్ కోసం, ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్ పరిశ్రమ కోసం భూములను కేటాయించామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక సీడ్స్ హబ్ వెనక్కి పోయిందన్నారు. మిగిలిన వాటిలో పరిశ్రమల ఏర్పాటు ఆశాజనకంగా లేదని వివరించారు. రూ.90 కోట్లతో కర్నూలులో విమానాశ్రయం ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో వైసిపిని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకొస్తే యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇస్తామని, ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీల్లోనూ, విదేశీ కంపెనీల్లోనూ పని చేస్తూ జీతాలు తీసుకునేలా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. వలంటీర్లను తొలగించబోమని, వారి చదువు, నైపుణ్యాన్ని బట్టి నెలకు రూ.50 వేలు సంపాదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమను కాపాడుతానని హామీ ఇచ్చారు. రాష్టాన్ని కాపాడుకునేందుకే పవన్ కల్యాణ్‌లోనూ, బిజెపితోనూ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగామన్నారు. ముస్లిం మైనార్టీలు ఎవ్వరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గతంలో కూడా ఎన్‌డిఎతో రెండుసార్లు కలిసి ఉన్నానని, ముస్లిం మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మతసామరస్యాన్ని కాపాడుతూ వచ్చామని అన్నారు. ముస్లిముల పరిస్థితి ఏమిటనే అభద్రతా భావనలో మైనార్టీలు ఉన్నారని, వారెవ్వవరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాదని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ అథోగతి పట్టించారని, ఉద్యోగులను, నిరుద్యోగ యువతను మభ్యపెట్టారని, వైసిపి ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని, ప్రభుత్వ అరాచకానికి మే 13న తెరపడనుందని, రాష్ట్రంలో మార్పు రానుందని పేర్కొన్నారు.
కదిరి, బనగానపల్లెల్లో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు
శ్రీసత్యసాయి జిల్లా కదిరి, నంద్యాల జిల్లా బసనగానపల్లెల్లో జరిగిన టిడిపి ఆవిర్భావ దినోత్సవాల్లో చంద్రబాబు పాల్గన్నారు. కదిరిలో టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టిడిపి జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. బనగానపల్లెలోనూ టిడిపి జెండాను చంద్రబాబు ఎగరవేశారు.
source : prajasakthi.com
Discussion about this post