ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ దిద్దుబాటు చర్యలకు దిగారు. సుబ్బారెడ్డి అలా అనలేదని, కొన్ని ప్రచార సాధనాలు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించాయని చెప్పడం గమనార్హం. చౌకబారు మాటలు, ఎత్తులతో ఎన్నికల్లో విజయం సాధించే ఉద్దేశం తమ పార్టీకి, తమ నాయకుడికీ లేదని వివరించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేవరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని మంగళవారం సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఆయన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్ష నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బుధవారం విశాఖపట్నంలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేందుకు పదేళ్లకు మాత్రమే అవకాశమిచ్చారని, ఆలోచన ఉన్న వారెవరైనా మళ్లీ కొనసాగించాలని అడుగుతారా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఏం చేస్తారని వైవీ సుబ్బారెడ్డిని విలేకర్లు అడిగితే.. విభజనచట్టంలోని హామీల సాధనకు కృషి చేస్తామని ఆయన చెప్పారంటూ సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యల్లో ఫుల్‌స్టాప్‌లు, కామాలు తీసేసి, కొన్ని వాక్యాలు తీసుకుంటే ఎలా అన్నారు. మరోసారి ‘నేను వినలేదు.. నేను చూడలేదు’ అని మాట దాటవేసే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యాలయంలోనే వైవీ సుబ్బారెడ్డి అలా మాట్లాడారని విలేకరులు చెప్పగా.. ససేమిరా కాదన్నారు. తన మాటలను వక్రీకరించారని సుబ్బారెడ్డి కూడా చెప్పారన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తమ పార్టీ ఆలోచన కాదని, విభజన చట్టంలోని అంశాలను సాధించుకోవడమే తమ బాధ్యత అని వివరణ ఇచ్చారు. ఉమ్మడి రాజధాని పదేళ్లేనని, కేంద్రం మరోసారి పునరుద్ధరిస్తే తమకు సంబంధం లేదన్నారు.
ప్రతిపక్ష నాయకులకు రాష్ట్రంలో సొంతిల్లు లేదని, ఓటు ఉందో లేదో కూడా తెలియదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఫిబ్రవరి, మార్చిలో చెల్లిస్తామని చెప్పామని, ఎందుకు సమ్మె చేస్తున్నారో తెలియదన్నారు. ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల బకాయిలున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. అది వాస్తవం కాదని అంటూనే అవాస్తవం కూడా కాదని ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు. గత ప్రభుత్వాల్లో బకాయిలు లేవా అని ఎదురు ప్రశ్నవేశారు. ఒక్కోసారి బకాయిల చెల్లింపు ఆలస్యమవుతుందని, జీతాలు సమయానికే ఇస్తున్నామని సర్దిచెప్పుకొన్నారు.
source : eenadu.net
Discussion about this post