ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రసార మాధ్యమాలలో ప్రచురితమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలిపారు. ఈ కమిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని అన్నారు. మీడియా ఉల్లంఘనలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రిజిస్టర్ కాబడిన జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీలు గానీ వారి తరఫున ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందుట కోసం నిర్ణీత నమూనాలో ప్రకటనల ప్రచారం చేయుటకు మూడు రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రిజిస్టర్ కాని రాజకీయ పార్టీలు ఇతర వ్యక్తులు వారి ప్రకటనలు ప్రచారం చేయుటకు ఏడు రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న రెండు రోజులు లోగా జిల్లా స్థాయి కమిటీ అనుమతి మంజూరు చేస్తుందన్నారు. వార్తా పత్రికలలో పోలింగ్ రోజు పోలింగ్ ముందు రోజు తప్పనిసరిగా మానిటరింగ్ కమిటీ నుంచి అనుమతి పొంది ప్రకటన ప్రకటించాల్సి ఉంటుందన్నారు. అన్ని రకాల టీవీ ఛానళ్లు, నెట్‌వర్క్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్ మెసేజ్‌లు ఈ పరిధిలోకి వస్తాయన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, తదితర ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కమిటీ పరిధిలోకి వస్తాయని తెలిపారు. అలాగే సినిమా హాల్ లోను, ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియోలలో ఎలక్ట్రానిక్, పత్రికలోను ప్రచారం అయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలు కూడా ముందస్తు అనుమతులు ధ్రువీకరణ పొందాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ కూడా ప్రసార మాధ్యమాలు గుర్తించాలని సూచించారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రచారాలు ప్రకటనలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘనలుగా పరిగణించి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.
source : prajasakthi.com
Discussion about this post