‘రాజకీయాలలో పిచ్చోళ్లు ఉంటారని వినడమే కానీ, చూడలేదు అని ఎవరైనా అనుకుంటుంటే, వారు ఆంధ్రప్రదేశ్‌కు రావచ్చు. అలా పిచ్చితనంతో వ్యవహరించే రాజకీయవేత్తలను చూసి ఇలా ఉంటారా అని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఒకరిద్ధరు పిచ్చి రాజకీయనేతలతో జనం సినిమా చూస్తుంటే, వారు చాలరన్నట్లు తెలంగాణ నుంచి వైఎస్ షర్మిల దిగుమతి అయ్యారు. ఆమె వ్యవహార శైలి, మాట్లాడుతున్న తీరు అంతా ఏ మాత్రం పద్ధతిగా లేవు. లేకుంటే ఏపీలో అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వనట్లు, ఇరవైఒక్కవేల మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అబద్ధపు లెక్కలు చెబుతారా! ఇది అచ్చంగా కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముప్పైఒక్కవేల మంది మహిళలు ఏపీలో మిస్సింగ్ అయ్యారంటూ ఓ పిచ్చి ప్రకటన చేసిన తరహాలోనే ఉంది.’
పవన్ కల్యాణ్ కూడా ఎప్పుడు ఏమి మాట్లాడతారో తెలియదు. షర్మిల కూడా ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. తన మాటలకు విశ్వసనీయత ఉండాలని, తను ఏదైనా చెబితే జనం శ్రద్ధగా విని అందులో వాస్తవం ఉందని అనుకోవాలని ఆమె భావించడం లేదు. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియాలో భారీగా తనకు వస్తున్న ప్రచారం చూసి మురిసిపోతున్నారేమో తెలియదు. కానీ అదే సమయంలో ఆమె కేంద్రంలోని బీజేపీని విమర్శించినా, పొరపాటున చంద్రబాబు ప్రస్తావన తెచ్చినా టీడీపీ మీడియా వాటన్నిటిని సెన్సార్ చేస్తున్న విషయం ఆమె గమనించడం లేదు. అంటే దాని అర్ధం రెండునెలల తర్వాత షర్మిల వార్తలను కూడా టీడీపీ మీడియా కరివేపాకు తీసిపారేసినట్లు తీసిపారేస్తుంది. కేవలం తన సోదరుడు వైఎస్ జగహన్‌మోహన్‌రెడ్డిపై ద్వేషంతో, టీడీపీ వారి రాజకీయ ట్రాప్‌లో పడి షర్మిల తెలివితక్కువ రాజకీయం చేస్తున్నారు.
source : sakshi.com
Discussion about this post