కరవు సీమ అనంతను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం.. తద్వారా భారీగా ఉపాధి కల్పిస్తామంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ ఈ జిల్లా ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ‘కియా’ పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి లభించేలా ప్రాధాన్యం ఇప్పిస్తామనీ కల్లబొల్లి మాటలూ చెప్పారు. వేలమందికి ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్ పరిశ్రమలను ఉద్ధరిస్తామంటూ ప్రగల్భాలు పలికారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఉత్తుత్తి హామీలు గుప్పించారు. తీరా గద్దెనెక్కాక తన అసలు రంగును బయటపెట్టారు. ఈ అయిదేళ్లలో జిల్లాకు ఒక్కటంటే ఒక్క సంస్థనూ తీసుకురాలేదు. పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో ఏర్పాటు చేసిన ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ కోసం గతంలో రైతులిచ్చిన 8వేల ఎకరాలను అయినవారికి దోచిపెట్టే ప్రయత్నం చేశారు. గ్రానైట్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచారు. ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ఎన్నికల ప్రచారం కోసం బస్సులో శ్రీసత్యసాయి జిల్లాకు వచ్చేందుకు సిద్ధమైపోయారు.
గ్రానైట్ రంగానికి శరాఘాతం
తాడిపత్రి ప్రాంతంలో 300 వరకు గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండేవి. 10వేల మంది కూలీలు వీటిపై ఆధారపడి జీవించేవారు. వైకాపా విధానాలు ఈ యూనిట్లకు శరఘాతంగా మారాయి. రాయల్టీ పెంపు, విద్యుత్తు ఛార్జీల బాదుడు, ఎండీఎల్‌ల రద్దు, సీనరేజీ వసూళ్ల బాధ్యతను ప్రయివేటుకు అప్పగించడం వంటి చర్యలతో ఇక్కడ 200 వరకు పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్ బిల్లులు కట్టలేక కొందరు యూనిట్లను మూసేసుకుంటే.. మరికొందరు యంత్ర సామగ్రిని తుక్కుకు అమ్మేసుకొని వెళ్లిపోయారు. దీంతో వేలమంది కూలీలకు ఉపాధి కరవైంది. తెదేపా హయాంలో మీటరు గ్రానైట్‌కు రూ.2వేల రాయల్టీ ఉంటే.. జగన్ ప్రభుత్వంలో దాన్ని రూ.3,450కు పెంచారు. గతంతో ఒక్కో పరిశ్రమకు సగటున రూ.1.30 లక్షల మేర విద్యుత్తు బిల్లు వచ్చేది. జగన్ ప్రభుత్వం కరెంటుఛార్జీలు పెంచడంతో రూ.1.80 లక్షల వరకు బిల్లు వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. దీనికితోడు స్థానిక వైకాపా నాయకులకు కమీషన్లు ఇవ్వలేదనే కారణంతో ఎండీఎల్ (మినరల్ డీలర్ లైసెన్స్)లను కొద్ది రోజులు బ్లాక్‌లో ఉంచారు. దీంతో ముడిసరకు దిగుమతి కష్టంగా మారి ఇబ్బంది పడ్డారు.
జాకీ జాడ లేకుండా చేశారు
తెదేపా హయాంలో ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ జాకీ అనంతపురం జిల్లాలో యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లోనే అవసరమైన అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తిచేశారు. రాప్తాడు సమీపంలో 27 ఎకరాలు కేటాయించారు. ప్రత్యక్షంగా 6వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.129 కోట్ల పెట్టుబడితో ఏటా 32.4 మిలియన్ల దుస్తులు తయారుచేసేలా కర్మాగారం ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. నిర్మాణ పనులూ మొదలుపెట్టారు. ఇంతలో వైకాపా అధికారంలోకి వచ్చింది. స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి తనకు రూ.20 కోట్లు కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఆ కంపెనీ తెలంగాణకు తరలిపోయింది.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలను జగన్ ప్రభుత్వం మూడేళ్లుగా నిలిపివేసింది. దీంతో ప్రభుత్వాన్ని నమ్ముకుని పెట్టుబడులు పెట్టిన యువ పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో ఎంఎస్‌ఎంఈలు 361 వరకు ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020లో రాయితీలు అందజేశారు. తరువాత ఏటా సెప్టెంబరులో రాయితీలు చెల్లిస్తామంటూ సీఎం జగన్ అప్పట్లో ప్రకటించారు. మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 361 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.50 కోట్ల మేర ఈ బకాయిలున్నాయి. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకైతే రెట్టింపు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలా చూస్తే అనంతపురం జిల్లాలోని దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.35 కోట్లు చెల్లించాల్సి ఉంది.
హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామికవాడలో 110 వరకు భారీ, మధ్య తరహా పరిశ్రమలున్నాయి. వీటికి అవసరమైన నీటిని శ్రీరామిరెడ్డి పథకం నుంచి సరఫరా చేసేవారు. వైకాపా పాలనలో నిర్వహణ కరవై పైపులైను దెబ్బతింది. దానికి కనీస మరమ్మతులు కూడా చేయించలేదు. దీంతో పరిశ్రమల యజమానులు ప్రయివేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ఈ సమస్యపై యజమానులు పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా పట్టించుకోలేదు. నీటి సమస్య కారణంగా కొత్త యూనిట్లు ప్రారంభించడం లేదు. మరోవైపు విద్యుత్తు ఛార్జీల భారంతో రెండేళ్లలో ఇక్కడి పది తుక్కు పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వాటిలో పనిచేసే 700 మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు.
source : eenadu.net
Discussion about this post