రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలిరోజు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని, 60 రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు చరిత్రలో లేనివిధంగా 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత తమకు ఉందన్నారు. ఇప్పుడూ అలాగే చరిత్ర సృష్టిస్తామని, ఎన్ని పోస్టులుంటే అన్నీ భర్తీ చేస్తామన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, డీఎస్సీ నిర్వహిస్తానని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే వేల కోట్ల రూపాయలు సంపాదించారని.. యువతకు మాత్రం వాలంటీర్లు, ఫిష్, మటన్ మార్ట్ ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. యువత మేల్కొని.. వారి జీవితాలను చీకటిమయం చేసిన జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో సొంత నియోజకవర్గం కుప్పంలో రెండోరోజు మంగళవారం తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
‘వాలంటీర్ల వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. తెదేపా అధికారంలోకి వస్తే వారి ఉద్యోగాలు తీయం. మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. ఇంజినీరింగ్ పూర్తిచేసిన వాళ్లూ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వారంతా బయటకు రావాలి. రూ.5 వేల జీతం బదులు.. నైపుణ్య శిక్షణతో ఇంటి నుంచే రూ.30 వేలు- రూ.50 వేలు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఎన్నికల సమయంలో వాలంటీర్లు తటస్థులుగా ఉండాలి. రూ.5 వేల జీతం కోసం వైకాపా నాయకులు చెప్పే తప్పుడు పనులు చేసి జైళ్లకు వెళ్లొద్దు. తెలుగుదేశం కార్యకర్తలు.. వాలంటీర్ల దగ్గరకు వెళ్లి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి వివరించాలి’ అని చంద్రబాబు చెప్పారు. ఈసారి కరడుగట్టిన వైకాపా కార్యకర్తలు కూడా తెదేపా, మిత్రపక్షాలకు ఓటేస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
‘జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారని కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎందుకు తక్కువ సీట్లు తీసుకోవాలని కొందరు అంటున్నారు. సీట్ల కోసం మేం కలవలేదు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే కలిశాం. జెండాలు మూడైనా మా ఎజెండా ఒక్కటే’ అని చంద్రబాబు తెలిపారు. ఏ రంగంలోనూ అడ్డదారిలో విజయాలు రావని.. లక్ష్య సాధనకు నిరంతర కృషి చేయాలన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తయిన తర్వాత ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనుకున్నానని, రాజకీయాల్లోకి వస్తే అఖిల భారత సర్వీసు అధికారులతో ప్రజలకు మంచి పనులు చేయించవచ్చని గుర్తించి, ఈ రంగాన్ని ఎంచుకున్నానన్నారు. 1978లో ఎమ్మెల్యే కాకముందు మూడేళ్లు ఇల్లిల్లూ తిరిగానని.. శాసనసభ్యుడైన తర్వాత నా సామర్థ్యాన్ని చూసి మంత్రి పదవి ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగానన్నారు. తర్వాత రెండేళ్లకు అమాత్యుడినయ్యానని గుర్తుచేశారు. ఆనంద్ అనే యువకుడు తాను ఇప్పుడు టీమ్ లీడర్‌గా ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తున్నానని చంద్రబాబుకు చెప్పారు. తాను ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, లక్షల మంది ఇప్పుడు మంచి జీతాలు సంపాదిస్తున్నారన్నారు. బిలియన్ డాలర్ల కంపెనీలు స్థాపించామని చెబుతుంటే సంతోషంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.
source : eenadu.net
Discussion about this post