రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. ఏప్రిల్ 18న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చివరి రోజైన గురువారం అభ్యర్థులు భారీస్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో పోటీకి ఎక్కువమంది నామినేషన్లు వేశారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 4,299 నామినేషన్లు, 25 పార్లమెంటు స్థానాలకు 770 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇప్పుడు అసెంబ్లీకి 5,460, పార్లమెంటుకు 965 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (పులివెందుల), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), కొడాలి నాని (గుడివాడ) తదితరులు ఉన్నారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించి నిబంధనలు పాటించని అభ్యర్థులను తిరస్కరిస్తారు. ఆమోదం పొందిన నామినేషన్లను ఈ నెల 29వ తేదీలోగా ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. 29వ తేదీ సాయంత్రానికి ఒక్కో నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్న విషయంపై స్పష్టత వస్తుంది.
source : sakshi.com
Discussion about this post