‘వరదలొచ్చిన ప్రతిసారి విజయవాడలోని కృష్ణలంక ప్రాంతమంతా మునిగిపోయేది. ఎన్నో ఏళ్లుగా వరదలు వస్తున్నా పేదలను ఎవరూ పట్టించుకోలేదు. గోడను కట్టించలేదు. మీ బిడ్డ ప్రభుత్వం పేదల బాధలను అర్థం చేసుకుని రూ.500 కోట్లతో కరకట్ట గోడను నిర్మించింది’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. విజయవాడలోని కృష్ణలంక వద్ద కృష్ణా నది కరకట్ట గోడ, రివర్‌వ్యూ పార్కులను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉన్న 31,866 పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘విజయవాడలో 22ఎ కింద నివాసితులకు పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్లు చేయించుకోలేకపోయేవారు. ప్రస్తుతం శాశ్వత హక్కు ఇళ్లపట్టాల పంపిణీతో నగరంలోని 21 వేల మందికి మేలు జరుగుతుంది. ఇళ్లను అమ్ముకునే హక్కునూ కల్పిస్తున్నాం. నది వెంట రూ.239 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాలకు శంకుస్థాపన చేశాం’ అని సీఎం తెలిపారు. కృష్ణలంక వద్ద కృష్ణా నదికి రెండువైపులా కరకట్టపై పార్కులు నిర్మించామని, దీనికి ‘కృష్ణమ్మ జలవిహార్’ అని పేరు పెడుతున్నామని వెల్లడించారు. ‘వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో విజయవాడలో రూ.400 కోట్లతో అంబేడ్కర్ స్మృతివనం నిర్మించి ప్రారంభించింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాలంటే ఒక్క ఫ్లైఓవర్ పూర్తి కాని పరిస్థితి. ఫ్లైఓవర్ పనులను పూర్తి చేయడమే కాకుండా యుద్ధప్రాతిపదికన మరో రెండింటిని నిర్మించాం’ అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
విజయవాడలోని రెండు ఫ్లైఓవర్లు తెదేపా హయాంలో నిర్మిస్తే.. వైకాపా ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటూ సీఎం జగన్ అబద్ధాలు చెప్పారని తెదేపా తీవ్రంగా విమర్శించింది. కృష్ణా నదిలో కరకట్ట నిర్మాణం మొదటి దశ యనమలకుదురు నుంచి రామలింగేశ్వర నగర్ వరకు తెదేపా హయాంలో నిర్మించారు. నాడు మిగిలిన రెండు ప్యాకేజీలకు ప్రస్తుతం మోక్షం లభించింది. ఉజ్జయిని తరహా నమూనా నిర్మాణంలో భాగంగా బెంజి సర్కిల్ పైవంతెనను తెదేపా హయాంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రెండో పైవంతెనకూ అప్పుడే శ్రీకారం చుట్టారు. విజయవాడ బైపాస్ రహదారులు ప్యాకేజీ మూడు, నాలుగు 2019 ఎన్నికల ముందే ఖరారయ్యాయి. నిధులను ఎన్‌హెచ్‌ఏఐ ఇచ్చింది. కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన బదులు సాధారణ వంతెనను నిర్మించింది. విమానాశ్రయం వద్ద పైవంతెనను మాత్రమే ఈ ప్రభుత్వం చేపట్టింది. వీటన్నింటినీ విస్మరించి తామే అభివృద్ధి చేశామంటూ సీఎం చెప్పడాన్ని తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తప్పుపట్టారు.
source : eenadu.net
Discussion about this post