డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మీ బిడ్డ జగన్‌వి! ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి’’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
‘చెల్లూరు సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు శత్రుసైనాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే, ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించారు.
వారికి అడ్డుతగులుతున్న ఆ పెత్తందార్లకు, ఆ కౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ప్రజాసైన్యం ఈ రోజు నా కళ్ల ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడుగా దత్తపుత్రుడున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు.
జగన్ కనుక ఇంటింటికీ మంచి చేయకపోయి ఉంటే, జగన్‌ను ప్రతీ ఇంట్లోనూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ్ముడిగా భావించకపోతే ఇన్ని తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం మీరే అని సగర్వంగా చెబుతున్నా. 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి నా నమ్మకం. ప్రతీ వర్గాన్ని మోసం చేసిన వారితో ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం.
జగన్‌ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా?
source : sakshi.com
Discussion about this post