‘ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై.. ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. ఎవరెక్కువ బూతులు తిడితే వాళ్లకు మంత్రిపదవులు, ఎక్కువ దాడులు చేస్తే.. పదోన్నతులు ఇచ్చే దారుణమైన పరిస్థితులొచ్చాయి. ఇలాంటి రౌడీయిజం కావాలా? ఈ ఎన్నికల్లో మీ ఓటు అభివృద్ధికా.. విధ్వంసానికా? సంక్షేమానికా.. సంక్షోభానికా? అనేది ప్రజలంతా నిర్ణయించుకోవాలి. ఈ గంజాయి మొక్కలను పీకేద్దాం. ఈ అయిదేళ్లలో అభివృద్ధి గురించి జగన్ ఒక్కసారైనా మాట్లాడారా? అమరావతి నిర్మాణం జరిగితే.. కృష్ణాజిల్లాలో భూములకు విలువ పెరిగేది. కానీ.. అమరావతి రాజధానితో ఈ గంజాయి బ్యాచ్ ఆడుకుంది. మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా? ప్రజలంతా ఆలోచించాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు, ఉయ్యూరుల్లో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటా
‘తెదేపా హయాంలో పోలవరాన్ని 72% పూర్తిచేసి అందిస్తే.. జగన్ దాన్ని అక్కడే ఆపేశారు. తెదేపా ప్రభుత్వం కొనసాగితే 2022లోనే పోలవరం ద్వారా నీళ్లు ఇచ్చేవాళ్లం. పోలవరం లేకపోతే.. కృష్ణాడెల్టా మొత్తం ఎడారిగా మారిపోతుంది. ఈ అయిదేళ్లలో ఎప్పుడూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ధాన్యం కొనడం లేదు.. ఏంటీ అరాచకం? అధికారంలోకి రాగానే.. అన్నదాతకు ఏటా రూ.20వేలు ఇస్తాను. రైతు కూలీలు, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి.. ఆదుకుంటా. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
‘యువతకు జాబ్ క్యాలెండర్, డీఎస్సీ అని జగన్ మోసగించారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అయిదేళ్లలో 20 లక్షల కొలువులు అందిస్తాను. మీ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. పిల్లలకు ఉద్యోగాల్లేక.. మీరు కూలి చేసి వారికి డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చారు’ అని ధ్వజమెత్తారు.
జగన్ కంటే ముందు గొడ్డలి వస్తోంది
‘పవన్ లాంటి వ్యక్తినీ అవమానించేలా జగన్ మాట్లాడుతున్నారు. ఆయన అభిమానులు తలచుకుంటే.. జగన్ పరిస్థితేంటి? జగన్ ఆకాశంలో తిరిగితే.. రోడ్డు పక్కనున్న చెట్లను నరికేస్తున్నారు. కర్ఫ్యూ పెడుతున్నారు. ఇలాంటి వాళ్లను నా జీవితంలో చూడలేదు. జగన్ కంటే.. ముందు గొడ్డలి వస్తోంది. ఫ్యాన్‌ను తీసేసి.. గొడ్డలే మీ పార్టీ గుర్తుగా పెట్టుకోండి..’ అని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు జగన్‌కు ఏ అధికారమూ లేదనీ, ఏదైనా ఎన్నికల సంఘమే చేయాలని చంద్రబాబు తెలిపారు. అధికారులకు అన్ని పార్టీలూ సమానమేనని, అయినా కొందరు జగన్ కోసమే పనిచేస్తున్నారని, రేపో ఎల్లుండో ఆయన మాజీ సీఎం అవుతారన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
‘జగన్ ఇంగ్లిష్ నేర్పిస్తారట, ఈతరం వాళ్లకు ఇంగ్లిష్ నేర్పించేదేంటి? ఇప్పుడు యువతకు ఐటీ నేర్పించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కావాలి. అవన్నీ నేను నేర్పిస్తా. జగన్ రాతియుగం వైపు తీసుకెళ్తే.. నేను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తా. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి.. తెలుగు పిల్లలందరికీ అండగా ఉంటాను’ అని చంద్రబాబు చెప్పారు.
source : eenadu.net
Discussion about this post