కుప్పం: తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. బడుగు, బలహీనవర్గాలే పార్టీకి బలమని తెలిపారు..కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు. కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని, పుంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని అన్నారు.”ఇప్పటిదాకా మీరు నాపై ఏడుసార్లు అభిమానం చూపించారు. కుప్పంలో వైకాపా అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదు. నియోజకవర్గ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం అడ్డుపడింది. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెదేపా కూటమి ప్రభుత్వానిది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక పోలీసులతో వారిని నియంత్రిస్తాం. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నా. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా.. జైలు నుంచి బయటికి రాగానే పార్టీ జెండా మోయడం ఆపలేదు. వైకాపా నాయకులు యథేచ్చగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. ‘కేజీయఫ్’ తరహాలో శాంతిపురంలో గ్రానైట్ తవ్వేశారు. ఈసారి కుప్పంలో తెదేపాకు లక్ష మెజార్టీ లక్ష్యం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నా” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.”వచ్చే ఐదేళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు నాదే. వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. వై నాట్ పులివెందుల.. అని నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ధి చేశా. ఆ తర్వాత దాని చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగాయి. రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు. వైకాపా నేతల వేధింపుల వల్లే సుబ్బారావు కుటుంబం చనిపోయింది. ఆయన కుమార్తెకు భరోసా ఇచ్చా. భూమి అప్పగిస్తామని చెప్పా. భూముల కోసం ఎన్‌ఆర్‌ఐను వేధించారు. మన భూమి, స్థలాలను కాపాడుకునేందుకు ఇన్ని బాధలు పడాలా? నంద్యాలలో అబ్దుల్ సలాం ఎంతో మనోవేదనతో చనిపోయాడు. అరాచకాలకు అడ్డుకట్టవేయాలంటే తెదేపా అధికారంలోకి రావాలి” అని చంద్రబాబు అన్నారు.మా మూడు పార్టీల అజెండా ఒక్కటే..రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తెదేపా, భాజపా, జనసేన పార్టీల అజెండా అని చంద్రబాబు అన్నారు. ”రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరం. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలు గెలవాలి. మేం అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛను ఇంటివద్దకే తెచ్చి ఇస్తాం. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కాపాడింది మన పార్టీయే. వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించాం. ప్రతి నియోజకవర్గానికి ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తాం” అని చంద్రబాబు అన్నారు..
Discussion about this post