లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్ర నేతలతో చంద్రబాబు
రాత్రి 11.30 నుంచి అరగంట పాటు అమిత్ షా, జేపీ నడ్డాలతో ఢిల్లీలో భేటీ
6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న బీజేపీ నేతలు.. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమన్న చంద్రబాబు
పవన్‌తో మాట్లాడి చెబుతామన్న అమిత్ షా, నడ్డా
అంతకుముందు ఢిల్లీలోని ఓ హోటల్‌లో బాబు రహస్య భేటీ.. గంటన్నరపాటు ఎవరితో భేటీ అయ్యారో ఎంపీలకూ తెలియని వైనం
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పుట్ట గతులుండవని తేలిపోవడంతో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ బలమూ సరిపోకపోవడంతో బీజేపీ కాళ్లపై పడ్డారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారు.
బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్న భావనతో సీట్ల సర్దుబాటులో వారెలా చెబితే అలా చేస్తానని చెప్పారు. రాత్రి ఏడున్నర గంటలకే ఈ భేటీ ఉంటుందని ప్రచారం జరిగినా, రాత్రి 11.30 గంటలకు అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు.
సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు, బీజేపీకి అందించే సహకారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటానని బాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు సిధ్దపడతాననే హామీ ఇ చ్చి నట్లుగా చెబుతున్నారు.
source : sakshi.com
Discussion about this post