‘మీడియా జోలికి వచ్చిన ఏ పార్టీ.. ప్రభుత్వం మనుగడ సాధించిన దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. వైకాపాకు రాజకీయ సమాధి తప్పదు.’ అని పలు రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. కర్నూలు ‘ఈనాడు’ కార్యాలయంపై రాళ్ల దాడి, రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టు శ్రీకృష్ణపై జరిగిన దాడిని నిరసిస్తూ గురువారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ‘చలో అనంతపురం’ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పాత్రికేయులు తరలివచ్చారు. తొలుత సంఘమేశ్ సర్కిల్ నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో తెదేపా నాయకులు ఆదినారాయణ, సరిపూటి రమణ మాట్లాడుతూ ప్రజల కష్టాలు, అక్రమాలపై కథనాలు రాసినా వైకాపా ప్రభుత్వం అణగతొక్కుతోంది. ఇలాంటి నీచమైన రాజ్యాన్ని కూలదోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేక వచ్చిందన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లప్ప ప్రసంగిస్తూ వైకాపా ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
source : eenadu.net
Discussion about this post