ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నవారు కొందరు… కుల, మతసంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాల పేరిట వైకాపా ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్ గుర్తు ముద్రించి ఉన్న సంచిలో ఆ పార్టీ అభ్యర్థి ఫొటోతో పాటు రూ.2వేల నగదు, కుక్కర్ సెట్, ఫ్లాస్క్ వంటి కానుకలను సరఫరా చేస్తున్నవారు మరికొందరు… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లతో పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి బహుమతులు అందిస్తున్నది ఇంకొందరు. సార్వత్రిక ఎన్నికల ముంగిట వైకాపా నాయకులు బరితెగించేశారు. ముందస్తుగా ఓట్ల కొనుగోలు మొదలుపెట్టేశారు. ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశమున్న ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలిస్తున్నారు. అధికారపార్టీ బాహాటంగానే ఇంత భారీగా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నా.. ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదు.
ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు
ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేయడమంటే ఓట్ల కొనుగోలు కిందే లెక్క. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123 (1) ప్రకారం ఇది తీవ్రమైన నేరం. నాయకులు ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలివ్వడం, వాటిని వారు తీసుకోవడం లంచమే అవుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7తో పాటు, ఐపీసీలోని 171బీ, 171ఈ ప్రకారం ఇది నేరం. ఓటర్లకు నగదు, తాయిలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలు పంపిణీచేస్తున్న ఘటనలపై వార్తలు, వాటి వీడియోలు, ఫొటోలు విస్తృతంగా తిరుగుతున్నా వైకాపా నాయకులపై ఎన్నికల సంఘం ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు? వైకాపా అభ్యర్థుల నుంచి విలువైన కానుకలు స్వీకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై సర్వీసు ప్రవర్తన నియమావళి ప్రకారం విచారణ జరిపేందుకు కూడా ఆస్కారం ఉంది.
ఊరూరా ప్రలోభాల పర్వమే…
అధికార వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలను వేరే నియోజకవర్గాలకు మార్చింది. ఆయా నియోజకవర్గాలకు కొత్తగా వెళ్లిన నాయకులు అక్కడ తమ ఉనికి చాటేందుకు ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేస్తున్నారు. స్వయంశక్తి సంఘాల మహిళా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్లను, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను, వాలంటీర్లను కానుకలతో ప్రలోభపెడుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు… రానున్న ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన అక్కడి వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. స్వయంశక్తి సంఘాల మహిళా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్లకు కుక్కర్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ-వ్యాలెట్‌ల ద్వారా వాలంటీర్ల ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నారు.
చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంక్రాంతి కానుకల పేరిట నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ కుక్కర్లు పంపిణీ చేశారు. వాటిపై సీఎం జగన్ ఫొటో, తన ఫొటోతో పాటు తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఫొటో ముద్రించారు.
source : eenadu.net
Discussion about this post