మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ హత్యలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు సీఎం జగన్, ఆయన భార్య భారతి హస్తం ఉందని, అందుకే కేసు విచారణ ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ఈ విషయం వైయస్‌ఆర్ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ‘వివేకా హత్యకు ముందు నన్ను భాస్కర్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. నాతో మాట్లాడుతూ వాళ్లు చెప్పినట్లు చేయాలని కోరారు. దాంతో నేను వెనక్కి వచ్చాను. వెంటనే అవినాష్‌రెడ్డి ఫోన్ ద్వారా జగన్ నాతో మాట్లాడారు. ‘దస్తగిరీ.. మావాళ్లు ఏం చెబితే అది చెయ్యి. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాన’ని చెప్పారు. దీంతో ధైర్యంగా రంగంలోకి దిగాను. భారతి సూచన లేనిదే జగన్ కూడా ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదు’ అని దస్తగిరి వెల్లడించారు.
‘వివేకా హత్య వెనక జగన్, భార్య భారతి హస్తం ఉన్నందునే సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేశారు. కడపలో సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనే కేసు పెట్టారు. సీబీఐ వాహన డ్రైవర్‌పై బెదిరింపులకు దిగారు. జగన్ అండ లేకపోతే వివేకా ఇంట్లో కుక్క కూడా చనిపోదు’ అని దస్తగిరి పేర్కొన్నారు. ‘నాకున్న గుండె ధైర్యంతోనే ఎర్రగంగిరెడ్డి హత్యకు నన్ను ఎంచుకున్నారు. అప్రూవర్‌గా మారే ముందు నా నిర్ణయాన్ని ఎర్రగంగిరెడ్డికి స్పష్టంగా చెప్పాను. అప్రూవర్‌గా మారినట్లైతే.. తనతో పాటు జగన్ దంపతులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కానీ, అప్రూవర్‌గా మారకపోయి ఉంటే తెదేపాపై కేసును నెట్టేసేవార’ని ఆరోపించారు. నన్ను వేధించిన వైకాపా నేతలను వదిలిపెట్టనని, వారు ప్రజల్ని మోసగించే వ్యక్తులని దస్తగిరి పేర్కొన్నారు.
‘నేను తప్పు చేశాను. పశ్చాత్తాపంతో అప్రూవర్‌గా మారాను. ఎన్ని కోట్ల డబ్బులిచ్చినా తలొగ్గను. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే లక్షల హత్యలు జరుగుతాయి. ప్రజలు ఆలోచించి ఓటేయాలి. నేను నిందితుడిగా కాకుండా, అప్రూవర్‌గా ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడుగుతాను. చంద్రబాబు, సునీత, షర్మిల, దస్తగిరి కలిసి తనపై పోరాటానికి దిగారని, హంతకుడు దర్జాగా తిరుగుతున్నాడని జగన్ ప్రొద్దుటూరు సభలో మాట్లాడారు. అది విడ్డూరం. నా ఫోన్ ట్యాపింగ్‌లో ఉంది. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చు. నాలో నీతి, నిజాయతీ ఉన్నందునే పారిపోకుండా సీఎం ఇంటి పక్కనే బతుకుతున్నా. సునీతతో నాకు ఒప్పందం ఉన్నట్లు అవినాష్‌రెడ్డి నిరూపిస్తే నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధం. నిరూపించలేకపోతే అవినాష్‌రెడ్డి సిద్ధమా?’ అని దస్తగిరి ప్రశ్నించారు. ‘కడప జైల్లో నన్ను వైకాపా నాయకులు బెదిరించారు. నా భార్యను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. నన్ను అన్యాయంగా 4 నెలల పాటు జైల్లో ఉంచారు. మారిన పరిస్థితుల్లో వివేకా హత్య కేసు విచారణలో వేగం పెరుగుతుంది. నన్ను శిక్షించినా ఫర్వాలేదు. కేసులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా న్యాయం చేయాలి’ అని దస్తగిరి కోరారు.
పులివెందులలో జై భీమ్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని దస్తగిరి వాపోయారు. పులివెందులలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 25న నామినేషన్‌కు సిద్ధమవుతుండగా, అదేరోజు జగన్ నామినేషన్ వేస్తారని పోలీసులు ఆంక్షలు పెట్టారు. జగన్ నామినేషన్ వేసే రోజు ఇతరులు వేయరాదనే నిబంధన ఉందా? సీఎం ఇంటికి దగ్గర్లోనే నా ఇల్లు ఉంది. అక్కడ జైభీమ్ పార్టీ పోస్టర్లు, బ్యానర్లు పెడితే తీసేయాలని పోలీసులు బెదిరిస్తున్నారు’ అని ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్ ఆదుకున్నట్లు గుర్తుచేశారు.
source : eenadu.net
Discussion about this post