మా పాలనలో రోడ్డు వేయటానికి మీరెవరంటూ వైకాపా నాయకుడు గుత్తేదారును దూషించడంతో, మనస్తాపానికి గురై వేసిన రహదారిని తొలగించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సీసీ రహదారి ఏర్పాటుకు ఎంపీ కేశినేని నాని కోటా కింద రూ.6.50 లక్షలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంజూరు చేయించారు. ఈ నిధులతో ఉప్పరపల్లి ఎస్సీకాలనీలో వారం రోజుల కిందట 100 మీటర్ల సీసీ రహదారి, నాయనపల్లి ఎస్సీ కాలనీలో 180 మీటర్ల మురుగుకాలువను గుత్తేదారు శ్రీనివాసరెడ్డి నిర్మించారు. ఈ రెండు పనులు చేపట్టినా ఇంకా నిధులు మిగలటంతో గుత్తేదారు నాయనపల్లి ఎస్సీ కాలనీ సప్లమ్మ దేవాలయం వద్ద రెండు రోజుల కిందట 10 మీటర్ల సీసీ రహదారి వేశారు. ఇది స్థానిక వైకాపా నాయకుడికి నచ్చలేదు. మా ప్రభుత్వంలో రోడ్డు వేయటానికి మీరెవరంటూ గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో వేసిన సీసీ రహదారిని గుత్తేదారు ఆదివారం సాయంత్రం పొక్లెయిన్‌తో తొలగించారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయకపోగా వేసిన రోడ్డును సైతం తొలగించేలా చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు.
source : eenadu.net
Discussion about this post