గొంతు తడపకుండా ఎన్నాళ్లు మాకు ఈ కన్నీటి కష్టాలు.. అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో మహిళలు ఖాళీ బిందెలు, కుండలు చేత పట్టుకొని కదం తొక్కారు. అనంతపురం ఎమ్మెల్యే, మేయర్, పాలక వర్గం, అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటూ నిరసన గళం వినిపించారు. రెండు నెలలుగా నీరు సక్రమంగా అందివ్వలేదంటూ.. ఆర్డీటీ కార్యాలయం ఎదురుగా, ఫెర్రర్ నగర్, శారదా నగర్, విజయనగర కాలనీ, అనంత గ్రామీణం రామకృష్ణ కాలనీ, టీవీ టవర్‌కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి స్థానిక వైకాపా నేతలు మద్దతు పలికారు. 23వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ హరిత ఆమె భర్త జయరాంనాయుడు, 12వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ షేక్ బాబా ఫకృద్ధీన్, మార్కెట్ యార్డు డైరెక్టరు గోవింద్‌లు బాధితుల పక్షాన నిలవడంతో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. నగరపాలక కార్యాలయం ప్రధానగేటు ముందు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, పాలక వర్గం బయటకు రావాలని నినదించారు. అధికారులెవరూ రాలేదు. పోలీసులు గేట్లు మూసేశారు. ఆగ్రహించిన కార్పొరేటర్ బాబా ఫకృద్ధీన్, పలువురు యువత ఒక్కసారిగా గేట్లు ఎక్కి నగరపాలక ప్రాంగణంలోకి దూకారు. ఈలలు, కేకలు వేస్తూ కమిషనరు ఛాంబర్‌ను ముట్టడించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అదుపు చేశారు. దీంతో నగరపాలకలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతపురంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ నీటి సమస్య లేదని నీరున్నా ఎందుకు నెలల తరబడి సరఫరా చేయలేక పోతున్నారంటూ నిలదీశారు. అనంతరం కమిషనరు మేఘస్వరూప్‌ను ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. రెండు మోటార్లుతో కొంత ఇబ్బంది ఉందని మరో మోటారు రాగానే సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.
source : eenadu.net
Discussion about this post