విశాఖలోని వీసీటీపీఎల్ కంటెయినర్‌లో అనుమానిత మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసును పూర్తిగా సీబీఐయే దర్యాప్తు చేస్తోందని నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ వెల్లడించారు. ఇంటర్‌పోల్ నుంచి వచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ప్రైవేట్ కంటెయినర్ టెర్మినల్‌కు వచ్చి సోదాలు చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో అనుమానిత మాదకద్రవ్యాలు ఉన్నట్లు గ్రహించి.. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారన్నారు. సోదాలు, దర్యాప్తు విశాఖకు చెందిన ప్రభుత్వ అధికారుల కారణంగా ఆలస్యమైందనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. మాదకద్రవ్యాల వాసనను గుర్తించేందుకు సీబీఐ అధికారులు డాగ్ స్క్వాడ్ కావాలని సిటీ పోలీసులను కోరగా పంపించామన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు తాను కూడా స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకున్నానన్నారు. అంతవరకు మాత్రమే తామున్నామన్నారు. తర్వాత డాగ్ స్క్వాడ్ అవసరం లేదని సీబీఐ డీఎస్పీ, కస్టమ్స్ ఎస్పీలు చెప్పటంతో వెనక్కి వచ్చామన్నారు. అంతేకానీ తమ వల్ల ఆలస్యమైందని చెప్పటం సరికాదన్నారు. సీబీఐ అధికారులు జప్తునకు సంబంధించి సాంకేతికపరమైన అంశాలతో రాసిన పదాలతో తమకు సంబంధం లేదని, ఈ దర్యాప్తులో విశాఖ ప్రభుత్వ అధికారుల జోక్యం లేదని స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post