ఓ దళిత ఇంజనీరుపై డీఈ చేసిన వ్యాఖ్యలు జలవనరుల శాఖలో దుమారం రేపుతున్నాయి. హెచ్చెల్సీ సర్కిల్‌లోని హెచ్చెల్సీ డివిజనలో డీఈ విశ్వనాథ్‌రెడ్డి, ఏఈ రామచంద్రమూర్తి మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది. అనంతపురంలోని హెచ్చెల్సీ డివిజన ఈఈ కార్యాలయంలో డీఈ విశ్వనాథ్‌రెడ్డి, ఏఈ రామచంద్రమూర్తి మధ్య వృత్తిపరమైన క్షేత్రస్థాయి పరిశీలన, టీఏ, డీఏలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. ఈక్రమంలో పీఏబీఆర్ సబ్‌డివిజన కార్యాలయం కూడేరులో ఉండాలి. అనంతపురంలోనే ఉంటూ లబ్ధి పొందుతున్నారంటూ ఏఈ రామచంద్రమూర్తి.. డీఈ విశ్వనాథ్‌రెడ్డిని నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈ..సబ్ డివిజన కార్యాలయం ఎక్కడుంటే నీకెందుకు… ఇక్కడ నుంచే విధులు నిర్వహిస్తామంటూ ఏఈపై మండిపడ్డారు. మాటల మధ్యలో కులం ప్రస్తావన రావడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. హెచ్చెల్సీ డివిజన ఈఈ శ్రీనివాసులు సమక్షంలో ఈ ఘటన ఈనెల 22న జరిగింది. దీనిపై అదేరోజు ఏఈ రామచంద్రమూర్తి త్రీటౌన పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారు. అటు నుంచి స్పందన రాకపోడంతో డీఎస్పీని కలిసేందుకు యత్నించారు. సీఎం పర్యటన నేపథ్యంలో డీఎస్పీ బిజీగా ఉన్నారని చెప్పడంతో వెనుదిరిగారు. ఈనెల 23న ఉరవకొండ పర్యటనకు వచ్చిన సీఎం జగన దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్లేందుకు ఏఈ రామచంద్రమూర్తి జగనన్నకు చెబుదాం స్పందనలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన త్రీటౌన పోలీసులు బుధవారం హెచ్చెల్సీ డివిజన ఈఈ శ్రీనివాసులను కలిసి ఘటనపై ఆరాతీశారు. జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, పోలీసులు అందజేయాలని ఇప్పటికే ఈఈకి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
source : https://www.andhrajyothy.com/2024/andhra-pradesh/ananthapuram/fire-of-words-1200844.html
Discussion about this post