అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ ఊసరవెల్లిలా మాటలు మారుస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం ధ్వజమెత్తారు. మంగళవారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద బంజారాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, బంజారాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవనాయక్, బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు డాక్టర్ కొండారెడ్డి, నరహరిప్రసాద్, సోమ్లానాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ అప్పుడు కోడి కత్తి, ఇప్పుడు రాయితో దాడి అంటూ జగన్ నాటకాలు ఆడుతున్నారన్నారు. గత ప్రభుత్వం బంజారాలకు ఎన్నో పథకాలు, రుణాలు అందించిందని, ఇప్పుడు అవేవి లేకుండా చేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేయలేమన్నారు. అభివృద్ధి కోసం పాటుపడే తెదేపాకే ఓట్లు వేస్తామని బంజారాలతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు మాట్లాడుతూ వైకాపాకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఎన్నో పథకాలు రద్దు చేసిందని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన బంజారాలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు.
source : eenadu.net
Discussion about this post