జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు భారీ షాక్ తగిలింది. పట్టణంలోని 3వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు అల్తాఫ్ ఆధ్వర్యంలో 150 మంది మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 3వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ఇర్బాన్‌బాషా, మన్సూర్, ఫరూక్, సబీర్, హుసేన్, మల్లి, మద్దిలేటి, శీను, రాముడు, బాలకృష్ణ, భీమరాజు, వెంకటేశ్వర్లు, అశ్వీన్‌కుమార్‌లతో పాటు మరో 150 మందికి శిల్పామోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శిల్పామోహన్‌రెడ్డి మాట్లాడుతూ 3వ వార్డు టీడీపీకి కంచుకోటగా ఉండేదని, నేడు ఆ కోటను బీటలు కొట్టి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. వారికి అన్ని వేళలా తాము అండగా నిలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
source : sakshi.com
Discussion about this post