పాఠశాలను ఎలా నిర్వహిస్తారో చూస్తాం
తాళం వేసి.. హెచ్‌ఎంను బెదిరించిన వైకాపా నాయకులు
తమకు తెలియకుండా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం ఎలా తయారుచేయిస్తారని వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు భోజనం పెట్టిస్తున్నా అడ్డుకుని.. బడికి తాళం వేసిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లి పంచాయతీ వంగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం వంగంపల్లి ప్రభుత్వపాఠశాలలో ముగ్గురు విద్యార్థులే ఉండటంతో రెండు కిలోమీటర్ల దూరంలోని ఇరగంపల్లి పాఠశాల ఏజెన్సీ వారు భోజనం అందించేవారు. ప్రధానోపాధ్యాయుడిగా గోపి బాధ్యతలు చేపట్టాక.. విద్యార్థుల సంఖ్య 23కు పెరిగింది. దాంతో పాఠశాల వంటగదిలో తయారుచేయాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆయన కోరారు. గత నెల 23 నుంచి ఏజెన్సీ నిర్వాహకులు భోజనం అందించకపోవడంతో ఇరగంపల్లి సర్పంచి గంగరత్న దృష్టికి హెచ్‌ఎం తీసుకెళ్లారు. వారంరోజుల పాటు సత్యసాయి భక్తుల సహకారంతో హెచ్‌ఎం సొంతడబ్బు కొంత వెచ్చించి విద్యార్థులకు ఉపాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు భోజనం తయారుచేసే బాధ్యతను స్థానికులకు అప్పగించారు. దీనిపై ఆగ్రహించిన సర్పంచి గంగమ్మ భర్త శ్రీనివాసులు, రేషన్ డీలర్ రమేశ్ శుక్రవారం పాఠశాలకు తాళం వేశారు. ఎందుకు తాళం వేశారో అర్థంకాని విద్యార్థులు గోడదూకి బడిలోకి చేరుకున్నారు.
విద్యార్థులను బలవంతంగా ఇంటికి పంపి…
పాఠశాలకు ఉదయం 8.45 గంటలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు గేటుకు తాళం ఉండటంతో అవాక్కయ్యారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న సదరు వైకాపా నాయకులు ‘మా అనుమతి లేకుండా ఏజెన్సీని ఇతరులకు అప్పగించి పాఠశాలను ఎలా నిర్వహిస్తారో చూస్తాం’ అని హెచ్చరించారు. విద్యార్థులను బలవంతంగా ఇళ్లకు పంపారు. దీంతో హెచ్‌ఎం కొత్తచెరువు చేరుకుని ఎంఈఓ జాన్‌రెడ్డెప్పకు చెప్పారు. అనంతరం వైకాపా నాయకుల తీరుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఉదంతం ‘ఈటీవీ’లో ప్రసారం కావడంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి స్థానిక అధికారులను వివరణ కోరారు. వెంటనే ఎంఈఓ జయచంద్ర 10.30 గంటలకు పాఠశాల వద్దకు చేరుకుని విచారణ చేశారు. గేటుకు తాళం తీయించి.. విద్యార్థులను రప్పించి భోజనం ఏర్పాటు చేయించారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ సర్కిల్ కార్యాలయానికి హెచ్‌ఎం, అధికారపార్టీ నాయకులను పోలీసులు పిలిపించారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని హెచ్‌ఎంపై నాయకులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.
source : eenadu.net
Discussion about this post