మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారి ఆర్థిక స్వావలంబనకు నిరంతరం కృషి చేసింది తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం ఓ ప్రకటనలో వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహిళల్ని మహాశక్తులుగా మార్చేందుకే మహాశక్తి పథకాన్ని ప్రకటించాం. ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500ల చొప్పున ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.15,000 చొప్పన ఆర్థికసాయం అందిస్తాం’’ అని హామీ ఇచ్చారు. ‘‘మహిళలంటే జనాభాలో సగం కాదు.. సమాజ శక్తిలోనూ సగం. అందరి మద్దతుతో త్వరలో ఏర్పడనున్న తెదేపా-జనసేన ప్రభుత్వంలో మహిళలకు భద్రత కల్పిస్తాం. వారి అభివృద్ధికి కృషి చేస్తాం’’ అని వివరించారు.
source : eenadu.net
Discussion about this post