చేయగలిగిందే చెప్పాం.. చెప్పింది చేశాం: శాసనసభలో సీఎం జగన్
ఆర్థిక సంక్షోభం, కోవిడ్‌ను దీటుగా ఎదుర్కొన్నాం
సవాళ్లకు ఎదురొడ్డి ప్రజలకు అండగా నిలిచాం.. 99 శాతం హామీలను చిత్తశుద్ధితో అమలు చేశాం
డీబీటీ, నాన్ డీబీటీతో రూ.4.31 లక్షల కోట్లు ప్రజలకు అందించాం
మాపై వ్యతిరేకతే ఉంటే ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయి?
రెండు జాతీయ పార్టీలతో చంద్రబాబుకు అవగాహన ఎందుకు?
అప్పులపై ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారం
బాబు హయాంలోనే అధికంగా అప్పులు
సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు గగ్గోలు
మళ్లీ దగా చేసేందుకే బాబు ఆరు వాగ్దానాలు.. చంద్రబాబు సంపద సృష్టి అంతా పచ్చ అబద్ధమే
ఆయన పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా?
ఆయన్ను నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్టే
రాష్ట్ర విభజన నుంచి ఇప్పటికి కూడా మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. మనం కలసికట్టుగా 60 ఏళ్లపాటు ఉమ్మడిగా హైదరాబాద్‌ను నిర్మించుకున్నాం. అది ఎకనామిక్ పవర్ పాయింట్. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ‘ట్యాక్స్ బాయోన్సీ’ అన్నది చాలా చాలా ముఖ్యం. పెద్ద పెద్ద నగరాల్లోనే ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా.
మేనిఫెస్టో హామీల్లో 99 శాతం వాగ్దానాలను ఈ ఐదేళ్లలో అమలు చేశాం. ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నాం. వైఎస్సార్‌సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా సరే కచ్చితంగా చేసి తీరుతుంది. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అఖండ మెజారిటీతో ప్రజల మన్ననలు పొంది మళ్లీ 3 నెలలకు ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం.
– సీఎం వైఎస్ జగన్
రాష్ట్ర విభజనతో ఏర్పడిన రెవెన్యూ లోటు, చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పెరిగిన ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి లాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొని గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు మంచి చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, తగ్గిన ఆదాయం, పెరిగిన ఖర్చులు, కేంద్ర నిధుల తగ్గుదలను గణాంకాలతో సహా వివరించారు.
టీడీపీ హయాంలో రాబడి, అప్పులు, ఖర్చులను వైఎస్సార్‌సీపీ వచ్చాక ఎలా ఉందో వెల్లడిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. అంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కూడా గత సర్కారు చేయని విధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాలతో ప్రజలకు మొత్తం రూ.4.31 లక్షల కోట్లను అందించామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వాస్తవాలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.
source : sakshi.com
Discussion about this post