దిల్లీలో సోమవారం జరిగిన స్వశక్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్ అనురాధతో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంత మహిళా సమాఖ్య ద్వారా సంఘాల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం, బాధ్యతలపై పలు రాష్ట్రాల వారికి శిక్షణ ఇస్తున్న అనురాధను ప్రధానితో ముఖాముఖి కార్యక్రమానికి ఎంపిక చేశారు. మోదీతో ఆమె మాట్లాడుతూ తొలుత బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ఇంటిలోనే చీరల వ్యాపారం ప్రారంభించానని తెలిపారు. భర్తకు ఆరోగ్యం బాగోకపోయినా ఆ వ్యాపారంతోనే కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద బిడ్డను ఇంజినీరింగ్, చిన్న కుమార్తెను ఎంబీఏ చదివించినట్లు చెప్పారు. మహిళా సంఘాల్లో ఉంటూనే తాను బీకాం పూర్తి చేసినట్లు వెల్లడించారు. అనురాధపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.
source : eenadu.net
Discussion about this post