మంత్రి రోజాకు తిరుమలలో నిరసన సెగ తగిలింది. శ్రీవారి సేవ కోసం వచ్చిన కొంతమంది ఆమెను చుట్టుముట్టి జై అమరావతి నినాదాలు చేస్తూ.. మద్దతు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ.. తాను మూడోసారి నగరి స్థానం నుంచే పోటీ చేయనున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొందరు శ్రీవారి సేవకులు అక్కడికి వచ్చి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. జై అమరావతి అనాలంటూ మంత్రిని కోరారు. ఇంతలో తితిదే భద్రతా సిబ్బంది శ్రీవారి సేవకులను హెచ్చరించి పంపేశారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం తమ భూములు ఇచ్చి రాజధాని నిర్మాణానికి చేయూత అందిస్తే ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. సాయంత్రం విలేకర్లతో శ్రీవారి సేవకులు మాట్లాడుతూ… మంత్రిని చూడగానే భావోద్వేగానికి గురై అలా చేశామన్నారు. తిరుమలపై అవగాహన లేకపోవడంతో శ్రీవారి ఆలయం ఎదుట నినాదాలు చేశామని, తమను మన్నించాలని విజ్ఞప్తి చేశారు.
source : eenadu.net
Discussion about this post