సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామంలో సర్పంచి లలిత, ఆమె భర్త, వైకాపా నాయకుడు లక్ష్మీనరసప్ప వర్గీయుల నుంచి మంత్రి ఉషశ్రీచరణ్‌కు శనివారం అసమ్మతి సెగ తగిలింది. పోలేపల్లి నుంచి రెండో రోజు మంత్రి ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు చాలకూరులో కార్యక్రమాన్ని సర్పంచి దంపతులు, ఎంపీపీ గంగమ్మ, జడ్పీటీసీ సభ్యుడు అశోక్ కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు నందినితో కలిసి పూర్తి చేశారు. సర్పంచి ఇంటిలో భోజనం చేసిన మంత్రి అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న ఎమ్మెల్యే శంకర నారాయణకు అసమ్మతి నాయకురాలు అశ్వర్థమ్మ ఇంటికి వెళ్లారు. సమాచారం తెలుసుకొన్న సర్పంచి లలిత వర్గీయులు మంత్రి తీరును తప్పుపట్టారు. నాయకురాలు గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని, మంత్రి ఎలా వెళ్తారని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆందోళన వ్యక్తం చేస్తూ తమ పంచాయతీలోని గుడ్డంనాగేపల్లిలో కార్యక్రమానికి వెళ్లకుండా బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ మంత్రికి స్వాగతం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆగ్రహంతో కార్యకర్తలు పీకి పడేశారు. దీంతో మాజీ కన్వీనర్ వెంకటరత్నం, ఉప సర్పంచి వేణుగోపాల్, జడ్పీటీసీ సభ్యుడు అక్కడికి చేరుకొని పరిస్థితిని సద్ధుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడికి సమీపంలో కారులో ఉన్న మంత్రి చరవాణిలో నాయకులతో చర్చించినట్లు తెలిసింది. ఈ దృశ్యాన్ని కొందరు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు చరవాణుల్లో చిత్రీకరిస్తుండగా మంత్రితో పాటు గన్‌మెన్లు, నాయకులు అడ్డుకొని దూషించారు. ఒక విలేకరి చరవాణిని లాక్కొని అతన్ని భయాందోళనకు గురి చేశారు. సర్పంచి వర్గీయులు వచ్చేది లేదని తేల్చి చెప్పడంతో గుడ్డంనాగేపల్లిలో కార్యక్రమాన్ని రద్దు చేసుకొని పక్క గ్రామ పంచాయతీ బ్రాహ్మణపల్లికి వెళ్లి ఆత్మీయ పలకరింపును కొనసాగించారు.
source : eenadu.net
Discussion about this post