పింఛను కోసం ఏప్రిల్‌లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పిన సీఎం జగన్, సీఎస్, ఉన్నతాధికారులు కలిసి మళ్లీ కుట్రకు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మే నెలలోనూ మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది చనిపోయినా పర్లేదన్న ధోరణితో ముఖ్యమంత్రి శవ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా గూడూరులో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘పింఛను బ్యాంకులో పడిందా? లేదా? అనేది లబ్ధిదారులకెలా తెలుస్తుంది? వృద్ధులు సెల్ఫోన్లో మెసేజ్‌లు చూసుకోగలరా? వారి అవసరాలకు డబ్బులందకుండా చేసి ప్రతిపక్షాలపై నిందలేయాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
‘ఇంటి వద్దే పింఛన్ల పంపిణీకి నాటకాలాడుతున్నారు. గవర్నరు, ఎన్నికల కమిషన్, సీఎస్‌ను కలిసి ఈ మేరకు మేము వినతిపత్రాలిచ్చాం. ఎన్నికల కమిషన్ స్పందించి ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని, ఆమోదయోగ్యంగా అమలు చేయాలని ఆదేశించింది. విషాద సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంది. ఇప్పుడు కిలోమీటర్ల దూరమున్న బ్యాంకుల వద్దకు ఎండలో వెళ్లి వృద్ధులు పడిగాపులు కాయాలా? గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీకి 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఐదు వేల మంది చొప్పున వెలుగు, వ్యవసాయ శాఖ సిబ్బంది, మూడు వేల మంది ఉద్యానశాఖ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వీరంతా కలిస్తే ఒక్కో ఉద్యోగి ఇచ్చే పింఛన్ల సంఖ్య 45లోపే ఉంటుంది. గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకు పింఛనర్లు ఎక్కడున్నారో తెలుస్తుంది. ఒక రోజులో ఇవ్వలేకపోతే రెండు రోజుల్లో ఇస్తారు. అయినప్పటికీ పింఛన్లు ఇవ్వడానికి సాకులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ చెప్పినా మొండికేస్తున్నారు. ఇదేమంటే వారికి ఇళ్లు తెలియవని అసంబద్ధంగా చెబుతారు. సచివాలయాల్లోని 41,230 మంది బీఎల్వోలకు ఓటరు స్లిప్పులు అందజేసే పనులున్నందున సమయం లేదని అంటున్నారు. తొలుత వారితో పింఛన్లు ఇప్పిస్తే తరువాత స్లిప్పులు ఇవ్వడమూ సులువవుతుంది. మే 13న ఎన్నికలైతే ఒకటో తేదీ నుంచే ఓటరు స్లిప్పులు పంచలేరు కదా?
ఏ ప్రిల్ 1న పింఛన్లకు డబ్బులేక.. మూడో తేదీన పంపిణీ ప్రారంభిస్తామంటూ మార్చి 28న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దని మార్చి 29న ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్ల ద్వారా ఇవ్వడం లేదంటూ వృద్ధులను తిప్పించింది. డబ్బుల్లేవని తెలిసినా ఏప్రిల్ 1నుంచే వైకాపా నాయకులు వృద్ధులను నడిపించుకొచ్చారు. కష్టపెడుతూ కనీసం మంచినీళ్లు, మజ్జిగ ఇవ్వలేదు. డ్రామాలు, కుట్రలకు పాల్పడ్డారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల వివరాల్లేవని గత నెలలో ప్రభుత్వం చెప్పింది. మే నెలకు సంబంధించిన పింఛను సొమ్మును ఖాతాల్లో వేస్తామని ఇప్పుడంటోంది. అప్పుడు లేని బ్యాంకు ఖాతా వివరాలు ఇప్పుడెలా వచ్చాయి? రాష్ట్రంలో 65.49 లక్షల పింఛనర్లు ఉండగా 48.92 లక్షల మందివి లింకులు దొరికాయని అంటున్నారు. 75 శాతం మందికి బ్యాంకులో వేసి మిగిలిన 16.57 లక్షల మందికి ఇళ్లకు వెళ్లి ఇస్తామంటున్నారు. వాళ్ల చిరునామాలు మీ వద్ద ఉన్నాయా? 25 లక్షల మందికి అనారోగ్యం ఉందని ఎలా తెలిసిందో చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప మోసం చేయకూడదు.
source : eenadu.net
Discussion about this post