‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బుధవారం 40 డిగ్రీల ఎండలోనూ జన జాతరను తలపించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం వేసవి తాపాన్ని ఎదురించింది. గొంతెండే వేడిమిలోనూ ‘నువ్వే కావాలి జగన్’ అంటూ నినదించింది. ధర్మాన్ని గెలిపించే యుద్ధంలో పల్నాట సైన్యమై ముందుకు కదిలింది. పౌరుషాల పురిటిగడ్డ సాక్షిగా విశ్వసనీయతే తమ వీరత్వమంటూ గర్జించింది. పల్లెపల్లె నుంచి పిడికిలి బిగించి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి తామంతా సిద్ధమంటూ నినదించింది.
12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలోని గంటావారిపాలెం రాత్రి బస శిబిరం నుంచి ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీలో చేరారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఉదయం 6.30 గంటల నుంచే శిబిరం వద్ద మహిళలు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు తరలివచ్చారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ శిబిరం నుంచి రోడ్డుపైకి రాగానే జైజగన్ నినాదాలతో గళమెత్తారు. సాయం కోరి వచ్చిన బాధితులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్య పరిష్కారానికి సీఎం అధికారులను ఆదేశించారు. కామేపల్లికి సమీపంలోని గ్రానైట్ కటింగ్ మహిళా కూలీలు రోడ్లపై వేచి చూడటాన్ని గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్‌లో నుంచి కిందకి దిగి వచ్చి ప్రభుత్వ పనితీరుపై ముచ్చటించారు.
వినుకొండ–కర్నూలు జాతీయ రహదారిపై ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుంచి బాపట్ల జిల్లా సంతమాగులూరు క్రాస్ మీదుగా నరసారావుపేట నియోజకవర్గం అన్నవరప్పాడులోకి బస్సు యాత్ర ప్రవేశించింది.
source : sakshi.com
Discussion about this post