‘‘తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక. వారి రుణం తీర్చుకునే సమయం ఇప్పుడొచ్చింది. అందుకే బీసీల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్ తీసుకొచ్చాం. రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ పెడతాం. వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటాం. 50 ఏళ్లకే పింఛను ఇస్తాం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈసారి ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే మీ ఆస్తి గోవిందా. ఇప్పటివరకు బెదిరించి మీ ఆస్తులను లాగేసుకున్నారు. ఇక మీదట ఏకంగా మీ ఆస్తులకు సంబంధించిన రికార్డులు తారుమారు చేసేసి, మీ ఆస్తులను కొట్టేసేలా ఒక దుర్మార్గమైన ఆలోచనతో భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. మేం అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపై, రెండో సంతకం భూహక్కు చట్టం రద్దుపై పెడతాను’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని తెచ్చిందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘చీరాల అంటే ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతం. ఇక్కడ బ్రిటిష్ వాళ్లు పన్నులు వేస్తే వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ స్ఫూర్తితో జగన్ అరాచకాలకు ఇక్కడి నుంచే చరమగీతం పాడాలి’’ అని పిలుపునిచ్చారు.
‘‘ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడాలి. మే 13వ తేదీ ఎప్పుడొస్తుందా అని ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారు. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు 10% ఉద్యోగాలు రిజర్వు చేశాం. 19 ఏళ్లు దాటిన ఆడపిల్లలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తాం. దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. ఆడబిడ్డలను శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాం. చీరాలలో టెక్స్‌టైల్ పార్కు, ఐటీ సెంటర్ నెలకొల్పి ఇంటినుంచే పని చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. అయినా వారు కష్టనష్టాలను భరించారు. ఏవో పనుల కోసం పార్టీని వీడిన పెద్దాయనను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోం. ఆయారాం, గయారాంలకు పార్టీలో చోటులేదు’’ అని స్పష్టం చేశారు. చీరాల కూటమి అభ్యర్థి ఎం.ఎం.కొండయ్యను, బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ను గెలిపించాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post