పది స్థానాలకూ పేర్లను ప్రకటించిన పార్టీ
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. లోక్‌సభ టికెట్ ఆశించి నిరాశ చెందిన సుజనాచౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ లభించింది. విశాఖ నార్త్ టికెట్ ఊహించినట్లే విష్ణుకుమార్‌రాజుకు దక్కింది. గతంలో ఇదే స్థానం నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. భాజపా జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ లోక్‌సభ స్థానాన్ని ఆశించారు. ఆయనకు ధర్మవరం అసెంబ్లీ టికెట్ లభించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. ధర్మవరం స్థానం గోనుగుంట్ల సూర్యనారాయణకు ఖరారు అవుతుందని భావించారు. గోనుగుంట్ల 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి తెదేపా తరఫున పోటీచేసి, గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం భాజపాలో చేరారు. తెదేపా నుంచి మంగళవారం భాజపాలో చేరిన రోషన్నకు బద్వేలు టికెట్ లభించడం గమనార్హం.
source : eenadu.net
Discussion about this post