ఇసుక అక్రమ దందా, మద్యం వ్యాపారంలో వచ్చే ఆర్థిక ప్రయోజనాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భాజపాకు ముడుపులు అందుతున్నందునే ఏపీ వైపు ఈడీ, ఐటీ విభాగాలు చూడటం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దృష్టిలో దేశంలో ఎలాంటి మరకలేని (క్లీనెస్ట్) ప్రభుత్వం ఏపీ ఒక్కటేనని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో కేవీపీ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ‘దేశంలో చాలామంది నేతలు అరెస్టయినా ఏపీలో నేతలకు మినహాయింపు కల్పించారు. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ మంత్రులు అరెస్టయ్యారు. కర్ణాటకలో డీకే శివకుమార్ అరెస్టయ్యారు. రేపో, ఎల్లుండో కేజ్రీవాల్ కూడా అరెస్టవుతారు. ప్రస్తుతానికి భాజపా భయపడుతున్నా.. ఎన్నికలయ్యాక మమతా బెనర్జీ కూడా బహుశా జైలుకెళ్లొచ్చు. అయితే ఏపీలో ఒక్క మంత్రిపైనా, అధికారిపైనా ఎలాంటి ఆరోపణలు వినడానికి గానీ.. చర్యలు తీసుకోవడానికి గానీ ప్రధాని మోదీ అంగీకరించరు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేను దేశ ద్రోహిగా చిత్రీకరించి వాళ్ల ఎంపీలను మాత్రం అరెస్టు చేస్తారు’ అని కేవీపీ విమర్శించారు.
నగదుకే మద్యం విక్రయాలు.. ఏపీలో మాత్రమే ఎలా సాధ్యం?
‘ఏపీలో నగదు ఇస్తేనే మద్యం అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇది సాధ్యమా? దేశమంతా మద్యం విక్రయాల్లో నగదురహిత లావాదేవీలు జరుగుతుంటే..ఏపీలో అందుకు విరుద్ధమైన పరిస్థితులున్నాయి. అయినా కేంద్రం ఎందుకు పట్టించుకోదు? ఏపీలో మంత్రిపైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు లేవో భాజపా సమాధానం చెప్పాలి. కేంద్రం ఆశీస్సులు లేకుండా రూ.లక్షల కోట్లు అప్పు చేయడం, ప్రతి వారం రుణాలు సేకరించడం సాధ్యమా?’ అని కేవీపీ నిలదీశారు.
ప్రధానిని అత్యధికసార్లు కలిసింది జగనే
‘ఇతర రాష్ట్రాల సీఎంల కంటే ఎక్కువసార్లు దిల్లీ వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. తాజాగా కూడా ఆయనకు ప్రధాని దర్శనం దొరికింది. సీఎం దిల్లీ వెళ్లినపుడల్లా పాత అంశాలనే మళ్లీ చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రధాని మోదీ, భాజపా.. ఏపీ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశాయి. రాజధాని అమరావతి నిర్మాణ సమయంలో మోదీ కలుషిత మట్టి, జలాలు తెచ్చి రాష్ట్ర ప్రజల నోట్లో మట్టికొట్టారు’ అని కేవీపీ మండిపడ్డారు. 2014లో తిరుపతి ఎన్నికల సభలో ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
‘పోలవరంపై ప్రభుత్వ వైఖరేంటో తెలియడం లేదు. ఈ విషయంలో జగన్, గత చంద్రబాబు ప్రభుత్వాలను భావితరాలు క్షమించవు. పోలవరం పూర్తయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకోవచ్చు. 2 వేల టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్మించాలని ఏపీ హైకోర్టులో నేను వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై కేంద్రం కౌంటర్ వేసింది గానీ.. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు వేయకపోవడం విడ్డూరం. కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి బ్యారేజ్ పూర్తవుతుందంటోంది. 41.15 మీటర్ల వరకే ఎత్తు ఉంటుందని చెబుతుంటే నోరెత్తి మాట్లాడే నాథుడే లేరు. మనం రాష్ట్రానికి ద్రోహం చేసుకుంటున్నామా? మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నాయని కేంద్రంలో ఓ ఉన్నతస్థాయి వ్యక్తి నాతో అన్నారు’ అని కేవీపీ చెప్పారు.
తల్లిని, చెల్లిని కించపరిచిన వారిపై చర్యలు తీసుకోలేని అసమర్థత
‘సొంత చెల్లెలు, తల్లి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ట్రోల్ చేస్తే ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోని, అరెస్టు చేయని అసమర్థ ప్రభుత్వం ఏపీలో ఉంది. ఫిర్యాదు చేస్తే ఒక ప్రభుత్వాధినేతగా స్వీకరించరు. వేరే రాష్ట్రంలో ఫిర్యాదు చేస్తే సహకరించరు’ అని జగన్‌పై మండిపడ్డారు.
చంద్రబాబు సమాధానం చెప్పాలి
‘కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఏయే అంశాలు చర్చించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ప్రత్యేక హోదా, పోలవరంపై ఏమైనా హామీలు ఇచ్చారా?’ అని కేవీపీ ప్రశ్నించారు.
source : eenadu.net
Discussion about this post