దేవతలపైకి దండెత్తిన దానవుల కథలెన్నో పురాణాల్లో కనపడతాయి. దేవాలయాలను కొల్లగొట్టిన కిరాతకుల దురాగతాలెన్నో చరిత్రలో నమోదయ్యాయి. ఆ రాక్షసుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్‌మోహన్‌రెడ్డి – దేవాలయ వ్యవహారాల్లో తుచ్ఛ రాజకీయాలకు పాల్పడ్డారు. నేరచరితులను ధర్మకర్తల మండళ్లలో నియమించి పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రతిష్ఠను దెబ్బతీశారు. మాట్లాడితే ‘‘దేవుడి దయ’’ అనే జగన్ – శ్రీరామచంద్రమూర్తి విగ్రహ విధ్వంసకులను వదిలేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.
పైన దేవుడు ఉన్నాడు… అన్నీ చూస్తాడు’’ అని విపక్షనేతగా జగన్ సుభాషితాలు వినిపించారు. అదే పెద్దమనిషి ముఖ్యమంత్రి కాగానే సింహాచలం అప్పన్న ఆలయ గౌరవాన్ని మసకబార్చే మహాపరాధానికి పాల్పడ్డారు. 12,716 ఎకరాల భూములు కలిగిన మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును రాత్రికి రాత్రే తీసేసింది జగన్ ప్రభుత్వం. తెల్లారే సరికి ఆ రెండింటికి ఛైర్‌పర్సన్‌గా సంచయితా గజపతిరాజుతో ప్రమాణ స్వీకారం చేయించింది. సంచయితా ఎవరో ఏమిటో అప్పటివరకు రాష్ట్ర ప్రజలకు తెలియదు. దిల్లీలో ఉండే ఆమెను ఉన్నట్టుండి తెరపైకి తీసుకొచ్చిన జగన్- మాన్సాస్ ట్రస్టు, సింహాచలం పవిత్రధామాలపై లేని వివాదాన్ని సృష్టించారు. స్వార్థప్రయోజనాల కోసం సంప్రదాయాలూ కట్టుబాట్లనూ కాలరాశారు. ఆ క్రమంలోనే అశోక్ గజపతిరాజు తండ్రి, మాన్సాస్ ట్రస్ట్ స్థాపకులు పీవీజీ రాజు వీలునామాను జగన్ తుంగలో తొక్కారు. తాను అనుకున్నదే తడువుగా అశోక్‌ను సాగనంపేశారు. సంచయితా నియామకం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పిన దరిమిలా జగన్ తేలుకుట్టిన దొంగయ్యారు. అప్పన్న చందనోత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయడంలోనూ ఆయన సర్కారు ఘోరంగా విఫలమైంది. వైకాపా నేతల సేవకే అంకితమైన అధికార యంత్రాంగం, పోలీసుల పెత్తనంతో ఆ ఉత్సవాల్లో సామాన్య భక్తులు నరకం చవిచూశారు. దానిపై బాధితులు గొంతెత్తితే- జగన్ భక్త శిఖామణి, మంత్రి బొత్స సత్యనారాయణ చిందులు తొక్కారు.
స్వయంగా కారాగారవాసం చేసొచ్చిన జగన్‌కు నేరచరితులంటే వల్లమాలిన అభిమానం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డు సభ్యుడిగా లిక్కర్ కేసులో నిందితుడు శరత్‌చంద్రారెడ్డిని(ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు) నియమించారు. అంతకు ముందు 2021లో తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని కొలువుతీర్చారు జగన్. అది చట్టవిరుద్ధమంటూ సంబంధిత జీవోలను హైకోర్టు కొట్టేసింది. తిరుపతిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు తితిదే నిధులు రూ.100 కోట్లను కేటాయించడాన్నీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. శ్రీవేంకటేశ్వరుడికి భక్తులిచ్చే సొమ్ములతో తమ రాజకీయ పలుకుబడిని పెంచుకునేందుకు జగన్ అనుచరులు సిద్ధమయ్యారు. వెంకన్న సొత్తుతో తిరుపతిలో పలు పనులు చేసి, వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలని వారు ఎత్తులు వేశారు. దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కనుసన్నల్లోనే అదంతా జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. నిధుల మళ్లింపు కుదరదంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అధికారపక్షం గొంతులో పచ్చివెలక్కాయ పడింది. జగన్ భక్తిగా మొక్కే విశాఖ శారదాపీఠం- తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టింది. ఆ విశృంఖలత్వాన్ని ఆపడానికీ ఉన్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
నిరుడు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ జాతర రోజుల్లో గుడి ప్రధాన ద్వారం దగ్గర ఓ పెద్ద పూల తోరణాన్ని ఏర్పాటుచేశారు. దానిపై ‘జె’ అనే ఆంగ్ల అక్షరం రాసి, దాని పక్కనే ‘గన్’ బొమ్మ వేశారు. ‘జగన్’ అని స్ఫురించేలా తయారుచేసిన ఆ తోరణాన్ని దైవసన్నిధిలో ప్రదర్శించడం- ‘స్వామిభక్తి’ మత్తులో ఉచ్ఛనీచాలు ఎరగని వైకాపా మూకల ఉన్మాదానికి తార్కాణం. అలాగే, మొన్న డిసెంబరులో నాయుడుపేట శ్రీపోలేరమ్మ ఆలయం మీద డిజిటల్ బోర్డు ఒకటి తగిలించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే వెర్రిమొర్రి నినాదం, సీఎం ఫొటో, ఫ్యాన్ గుర్తు ఉన్న బోర్డు అది… దాన్ని ఏకంగా గుడి మీదే పెట్టేశారు. దానికి రెండు నెలల మునుపు నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఏలూరు వైకాపా ఎంపీ కె.శ్రీధర్ తన పుట్టినరోజు వేడుకలను ద్వారకా తిరుమలలో ఆడంబరంగా చేసుకున్నారు. ఆలయ సిబ్బందితోనే వంటలు వండించి, వారితోనే పార్టీ కార్యకర్తలకు వడ్డన చేయించారు. ఆలయాలను అపవిత్రం చేసి అఖిలాంధ్ర భక్తకోటికి గుండెకోతను మిగిల్చిన జగన్‌ను, ఆయన అసురగణాలను క్షమించేదెవరు?
source : eenadu.net
Discussion about this post