తన జీవితం జగనన్నకే అంకితం అంటున్నాడు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన రామిరెడ్డి అమరనాథ్ రెడ్డి. ఈయనకు ముఖ్యమంత్రి అంటే పంచ ప్రాణాలు. విశాఖ శివారు దువ్వాడ ఫార్మాసిటీలోని లీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌లో 11 ఏళ్లుగా క్వాలిటీ విభాగంలో పనిచేస్తూ గాజువాకలో ఉంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపించినందున రూ.40 వేల వేతనం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలేసుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలంటూ ప్రతి గ్రామం, వీధిలో ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం తన ద్విచక్ర వాహనాన్నే ప్రచార రథంలా మార్చేశారు. వాహనానికి ఇరువైపులా ‘బలవంతుడికి…బలహీనుడికి జరిగే యుద్ధం’ అనే స్టిక్కర్ అతికించుకున్నారు. ద్విచక్ర వాహనంతో పాటు హెల్మెట్‌కు కూడా ప్రచార నిమిత్తం స్టిక్కరింగ్ చేయించుకున్నారు. అమరనాథ్‌రెడ్డి 2014, 2019 ఎన్నికల్లోనూ జగన్ కోసం ప్రచారం చేశారు. ప్రస్తుతం కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం రాప్తాడులో జరిగిన ‘సిద్ధం’ సభకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వీలుగా తన భార్య మనోజ్ఞ, ఏడాది పాప నివేదితా రెడ్డిని గుంటూరులోని అత్తారింట్లో వదిలి పెట్టినట్లు అమరనాథ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు తాను ప్రచారంలో పాల్గొంటానన్నారు. జీవితాంతం జగనన్నతోనే తన ప్రయాణం అంటూ ఉద్వేగభరితంగా చెప్పారు.
source : sakshi.com
Discussion about this post