బెదిరింపులు, లాబీయింగ్‌కు లొంగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఐదు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను మార్చారు. మరో మూడు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీలో మరోమారు దుమారాన్ని రేపింది. అభ్యర్థుల మార్పు జరిగిన నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలు ఆందోళనలకు దిగారు.
ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటన్నింటికీ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గి ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఉండి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా మంతెన రామరాజును తొలుత ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకు మొండిచేయి చూపించి, రఘురామకృష్ణం రాజుకు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, ఆ తర్వాత చంద్రబాబు పంచన చేరిన రఘురామకృష్ణరాజు ఈసారి అదే స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగాలని భావించారు.
అయితే, నరసాపురం లోక్‌సభ స్థానం బీజేపీకి వెళ్లింది. బీజేపీలో చేరిపోయి నరసాపురం నుంచి పోటీ చేయాలని రఘురామ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, బీజేపీ ఆయన్ని దగ్గరకు రానివ్వలేదు. రఘురామకృష్ణరాజు ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు.. నరసాపురం లోక్‌సభ స్థానాన్ని బీజేపీ నుంచి తీసుకొని, రఘురామకృష్ణరాజును టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. దీంతో రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ స్థానంపై కన్నేశారు. ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయమని కొద్దిరోజులుగా చెప్పుకొంటున్నారు.
ఈమేరకు చంద్రబాబును డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయనకు సీటు ఇవ్వకపోతే తాను ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడటంతో గత్యంతరం లేక చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకుని ఉండి అసెంబ్లీ సీటు ఇచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా బ్రోకర్ రాజకీయాలు చేసే రఘురామకృష్ణరాజుకి సీటు ఇవ్వొద్దంటూ రామరాజు వర్గం ఆందోళనకి దిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. రామరాజును నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు అక్కడ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షురాలిగా ఉన్న మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.
source : sakshi.com
Discussion about this post