‘పింఛన్ కింద నెలకు రూ.35 ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్. దాన్ని రూ.70కు పెంచాం. అనంతరం రూ.200 నుంచి రూ.2వేలు చేసిందీ తెదేపా ప్రభుత్వమే. తెదేపా-జనసేన అధికారంలోకి వస్తే… పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతాం. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తాం. బీసీ ఉప ప్రణాళిక అమల్లో భాగంగా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున… ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… ‘బీసీల డీఎన్‌ఏలోనే తెదేపా ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వెనకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించాం. తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి మరింత ప్రాధాన్యం ఇస్తాం. బీసీలంటే తమ పల్లకీ మోసే బోయీలని జగన్ అనుకుంటున్నారు. బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు, సమాజానికి వెన్నెముక అని మేం నిరూపిస్తాం’ అని స్పష్టంచేశారు. బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత నేతలు, కార్యకర్తలపై ఉందని, వెనకబడిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు.
‘జయహో బీసీ.. అనేది తెదేపా-జనసేన నినాదం.. విధానం కావాలి. సూపర్ 6 కింద ఆరు హామీలిచ్చాం. బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తాం. అన్ని వర్గాలనూ ఆదుకుంటూ.. సముచిత అభివృద్ధి చెందేలా ప్రణాళికను రూపొందించి చిత్తశుద్ధితో అమలుచేస్తాం. నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాం’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. ‘153 బీసీ కులాల్ని 53 సాధికార కమిటీలుగా విభజించి మూడేళ్లుగా 800 సమావేశాల్ని నిర్వహించాం. కుల, ప్రజాసంఘాలతో మాట్లాడాం. పాదయాత్ర సందర్భంగా వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను లోకేశ్ అందించారు. తెదేపా-జనసేన నాయకులు కూర్చుని బ్రహ్మాండమైన డిక్లరేషన్‌ను తయారు చేశారు’ అని ప్రశంసించారు. ‘యువగళం, తాడేపల్లిగూడెం, మంగళగిరి సభలతో వైకాపా గిజగిజలాడుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతే’ అని ధీమా వ్యక్తంచేశారు.
ప్రతి కులానికీ నిధులిస్తాం
బీసీల్లోని 153 కులాలకు.. న్యాయం చేసే బాధ్యతను తెదేపా-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి కులానికీ నిధులు కేటాయించడంతోపాటు.. వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని చెప్పారు. ‘రజకులను ఎస్సీల్లో చేర్చేందుకు, వడ్డెరలను ఎస్టీల్లో చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం. మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారిన 217 జీవోను రద్దు చేస్తాం’ అని వివరించారు. చేనేతలను ఆదుకుంటామని, నూలుపై జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ తెస్తామని చెప్పారు. ‘వైకాపా పాలనలో చెరువులు, ధోబీఘాట్లపై రజకులకు హక్కులు తీసేశారు. ధోబీఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఎత్తేశారు. యాదవులకు, డెయిరీ పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని తొలగించారు. బంజరు భూముల్లో పశువుల్ని మేపడానికి ఉద్దేశించిన జీవోనూ అమలు చేయడం లేదు’ అని ధ్వజమెత్తారు.
బీసీ నాయకత్వంపై గొడ్డలి వేటేసిన జగన్
‘వెనకబడిన వర్గాల్లో నాయకత్వ లక్షణాన్ని పెంపొందించింది తెదేపానే. ఆ నాయకత్వంపై గొడ్డలివేటు వేసింది మాత్రం జగన్’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. నలుగురు సొంత సామాజిక వర్గీయులతో పెత్తందారీ రాజకీయం చేస్తున్న జగన్.. బీసీ వర్గాలను అణగదొక్కుతున్నారని, వారికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘జయహో బీసీ సభా వేదికపై ఉన్న నాయకులంతా జగన్ బాధితులే. అచ్చెన్నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నారు. ఎక్కడో హత్య జరిగితే ఆ నెపాన్ని కొల్లు రవీంద్రపై నెట్టి జైల్లో పెట్టారు. యనమల రామకృష్ణుడు, కళా వెంకటరావు తదితరులపైనా కేసులు నమోదు చేశారు. చివరకు నేనూ, పవన్‌కల్యాణ్ కూడా బాధితులమే’ అని చెప్పారు.
source : eendu.net
Discussion about this post