ప్రశాంత్ కిశోర్ పార్టీ బిహార్‌లో దిక్కుమొక్కూ లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. బిహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ప్రశాంత్ కిశోర్‌పై విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకుని కన్సల్టెన్సీలో ఒక డైరెక్టర్‌గా ఉండే ప్రశాంత్ కిషోర్ బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ పలుమార్లు రహస్యంగా భేటి అవుతున్నారని, అందులో భాగంగానే రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఇద్దరూ రహస్యంగా కలుసుకున్నట్లు పలు పత్రికల్లో వచ్చిందన్నారు. ‘డీబీటీ, అభివృద్ధి రెండూ చేయలేని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారన్నట్లు ప్రశాంత్‌కిశోర్ చెప్పడానికి కారణం నెలరోజులు క్రితం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? ఆ తర్వాత రహస్యంగా పలుమార్లు ప్రశాంత్ కిశోర్ చంద్రబాబును కలవడం నిజం కాదా? ఒక పీకే వల్ల కావడంలేదని చంద్రబాబు రెండో పీకేని కూడా తెచ్చుకున్నారు’ అని పేర్కొన్నారు.
ఒక స్టేట్‌మెంట్‌తో మొత్తం ప్రజల నాడిని మార్చేయొచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు తన సొంత రాష్ట్రం బిహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని ఎద్దేవా చేశారు. పేదలకు మేలు చేస్తూ అవినీతికి తావులేకుండా అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఓట్లు వేయకుంటే చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసేవారికి ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు.
source : sakshi.com
	    	
                                









                                    
Discussion about this post