మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. అదనంగా వసూలు చేస్తున్న రూ.140 తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయి. ఈ జలగ మీ రక్తాన్ని తాగుతూనే ఉంటుంది. ఎన్నికల ముందు మద్యనిషేధం అని ఇప్పుడు ఏమొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారో నిలదీయండి. తన ఆదాయం కోసం నాసిరకం మద్యాన్ని అమ్మి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు జగన్‌మోహన్‌రెడ్డి.’’
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆడుతున్న నాటకాలు బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిని మించేలా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో జగన్ రోజుకో అబద్ధం చెబుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు, శింగనమల, కదిరిలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘2019 మార్చి 15న సాక్షి టీవీలో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారన్నారు. తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులన్నారు. తర్వాత గొడ్డలిపోటు అంటూ నారాసుర రక్తచరిత్ర పేరుతో నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో వార్త ప్రచురించారు. తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్‌మెంట్ వివాదమే హత్యకు కారణమన్నారు. బాబాయి హత్యను రాజకీయంగా ఉపయోగించుకున్నారు. అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణ కావాలని, అధికారంలోకి వచ్చాక వద్దని కేసు విత్‌డ్రా చేసుకున్నారు. జగన్‌ను నమ్మి మోసపోయానని వివేకా కుమార్తె పోరాటం మెదలుపెడితే.. రెండో వివాహం కారణమని, ఆస్తి కోసం కుమార్తె, అల్లుడే చంపారని నిందలు వేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్లు ప్రశ్నిస్తుంటే వారిని నేనే నడిపిస్తున్నానని నాటకాలాడుతున్నారు. సొంత చెల్లెలిపైనే వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. తనను ప్రశ్నించిన వారందరినీ వేధింపులకు గురిచేస్తున్న జగన్ ఓ మానసిక రోగి. జగన్ సిద్ధంగా ఉండు.. నిన్ను, నీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టేరోజు దగ్గర్లోనే ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మెగాడీఎస్సీపై తొలి సంతకం
‘‘అనంతకు కియా తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడం తెదేపా బ్రాండ్ అయితే… జాకీ పారిపోయేలా చేయడం, పెట్టుబడులను తరిమేయడం జగన్ బ్రాండ్. తెదేపా అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే. ఉద్యోగాల్లేకుండా జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చాడు. దుర్మార్గుడి పాలనలో సమాజం చెడిపోయింది. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో దాదాపు తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప ఈ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరు. వైకాపా ప్రభుత్వంలో అందరూ నష్టపోయారు. తెదేపాను గెలిపిస్తే మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను’’ అని చంద్రబాబు చెప్పారు.
source : eenadu.net
Discussion about this post