స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందికొట్కూరు, కర్నూలు వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రజలు సోమవారం బ్రహ్మరథం పట్టారు. నందికొట్కూరు నుంచి కర్నూలు చేరుకున్న ఆయన నగరంలోని ఒకటో పట్టణ ప్రాంతం, చిన్నమ్మవారిశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. జనం భారీగా తరలిరావడంతో యాత్రకు ముందుకు సాగేందుకు సమయం పట్టింది. మహిళలు సైతం పెద్దఎత్తున తరలివచ్చి స్వర్ణాంధ్ర సాకార యాత్రకు సంఘీభావం తెలిపారు. వైకాపా పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో సుమారు 50 నిముషాల సేపు బాలకృష్ణ వివరించారు. కేంద్రం సహకారం కోసమే భాజపాతో తెదేపా పొత్తు పెట్టుకుందని చెప్పారు. ముస్లింలను తెదేపా ఎప్పుడూ ఓటు బ్యాంకుగా చూడలేదని పేర్కొన్నారు. వారిని సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా చేసేందుకు తెదేపా ఎలాంటి చర్యలు తీసుకుందో వివరించారు. రంజాన్ తోఫా, ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర అంశాలన్నీ ప్రస్తావించారు. హిందీలో సైతం కొద్ది నిమిషాలు ప్రసంగించారు. బాలకృష్ణ అభిమానులు యాత్ర మార్గంలో క్రేన్ సాయంతో రెండు భారీ గజమాలలు వేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు. బాలయ్య ప్రసంగం పూర్తయ్యే సరికి రాత్రి సుమారు 9.45 గంటలైంది. కార్యక్రమానికి వచ్చినవారు అప్పటివరకు అక్కడే ఉండి బాలకృష్ణ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకున్నారని, అక్రమాలు చేశారన్న ఉద్దేశంతోనే ఆయనకు టికెట్ ఇవ్వకుండా మార్చేశారని బాలకృష్ణ అన్నారు. మరొకరికి దోపిడీ చేసే అవకాశం కల్పించారని ఎద్దేవా చేశారు.
source : eenadu.net
Discussion about this post