రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీల మాదిరే జనసేన కూడా పూర్తిగా తోకపార్టీగా మారిపోవడంపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన–టీడీపీ మధ్య కుదిరిన పొత్తులో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను పవన్ పార్టీకి కేవలం 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే చంద్రబాబు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగుదేశం గతంలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాటికి కేటాయించిన సీట్లతో పోల్చితే ఇప్పుడు జనసేనకు కేటాయించిన సీట్లు చాలా తక్కువని జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.
చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో పవన్‌కళ్యాణ్ స్వయంగా జైలుకెళ్లి ఆయన్ను కలిసొచ్చిన తర్వాత అక్కడికక్కడే పొత్తు ప్రకటన చేసిన తీరుతో తమ పార్టీకి తప్పకుండా 40–45 స్థానాలకు మధ్య సీట్ల కేటాయింపు ఉంటుందని జనసేన శ్రేణులు భావించారు. కానీ, తీరా శనివారం కేవలం 24 అసెంబ్లీ స్థానాలేనని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
2014 జనసేన ఏర్పాటు నుంచీ పరిశీలిస్తే.. పవన్‌కళ్యాణ్ కార్యక్రమాలన్నీ తన సొంత పార్టీ కంటే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసమే ఆరాటపడి పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని జనసేన శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నారు.
source : sakshi.com










Discussion about this post