తెల్లవారుజాము నుంచే ఇంటి తలుపు తట్టి పింఛన్ అందించే వలంటీర్లను ఎన్నికల పేరుతో విధులకు దూరంగా పెట్టించినందుకు అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు తదితరుల ఉసురు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందించే వలంటీర్ల సేవలను ఓర్వలేక ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రతిసారి కియా పరిశ్రమ తానే తెచ్చానని చంద్రబాబు చెబుతుంటారని.. పరిశ్రమ ఏమీ వాళ్ల అబ్బ సొత్తు కాదని ఎమ్మెల్యే దుద్దుకుంట విమర్శించారు. టీడీపీ హయాంలో ఇక్కడ కొరియా వాళ్లే ఉద్యోగులుగా ఉండే వారని, సీఎం జగన్ స్థానికంగా 70 శాతం మందికి అవకాశం కల్పించాలనే నిబంధన పెట్టారని ఇప్పుడు స్థానికులు ఉద్యోగాలు చేసుకుంటున్నారని వివరించారు.
మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి తన కోడలు సింధూరరెడ్డిని ఎలాగైనా గెలిపించుకునేందుకు చేస్తున్న గిమ్మిక్కులు ఏమాత్రమూ పని చేయవని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అన్నారు. పార్టీలో ఒకరో ఇద్దరో చేరితే వందల కుటుంబాలు చేరినట్లు ప్రచారాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీలోకి వందలాది కుటుంబాలు చేరుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా చేరికలు ఉంటాయని చెప్పారు.
source : sakshi.com
Discussion about this post