సిటింగ్‌లైన తమకే ఎసరు పెట్టారన్న కోపం… తమను కాదని స్థానికేతరుల్ని తెచ్చారన్న ఉక్రోషం… సమన్వయకర్తలుగా నియమించి.. ఆశలు కల్పించి… సీట్లని మాత్రం వేరేవారికి ఇచ్చారన్న అసంతృప్తి… వ్యతిరేతక ఉన్నా పాతవారిని కొనసాగిస్తున్నారనే కినుక… ఇలాంటి ఎన్నో కారణాలతో చాలా నియోజకవర్గాల్లో వైకాపా నేతలు తమ పార్టీ అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమకు జరిగిన అవమానాన్ని భరించలేక కొందరు పార్టీ మారుతుంటే, ఇంకొందరు కొనసాగుతూనే ఫ్యాన్ రెక్కల్ని వంచాలన్న కసితో పని చేస్తున్నారు.
అధికార వైకాపా అభ్యర్థులపై ఆ పార్టీ నేతల నుంచే తిరుగుబాటు తీవ్రమైంది. పార్టీలో అంతర్గత వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. మెజారిటీ నియోజకవర్గాల్లో కలహాల కుంపట్లు రగులుతున్నాయి. కుమ్ములాటలు నిత్యకృత్యమయ్యాయి. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించబోయేది లేదంటూ కొందరు నేతలు ప్రకటిస్తుంటే… వాళ్లు ఓడిపోతే మాకు సంబంధం లేదంటూ మరికొందరు చేతులెత్తేస్తున్నారు. తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నారు. కొన్ని ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులను వ్యతిరేకిస్తూ ఒక ప్రధాన సామాజికవర్గం స్వతంత్ర అభ్యర్థులను బరిలో నిలిపేందుకూ సిద్ధమవుతోంది. రిజర్వుడుతోపాటు ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ఇరకాటం పెడుతున్న వారిలో ఎక్కువ శాతం నేతలు ఆ పార్టీలో అగ్ర తాంబూలాన్నందుకునే ఒక ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.
source : eenadu.net
Discussion about this post