సచివాలయ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, వ్యాయామంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు నిర్వహిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్రస్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘గ్రామాల్లోని క్రీడా మాణిక్యాలను సరైన పద్ధతిలో ఎంపిక చేసి, శిక్షణ ఇస్తే వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయగలం. 47 రోజులపాటు నిర్వహించిన క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీల్లో 27.4 లక్షల మంది పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో 260 మ్యాచ్‌లు నిర్వహించాం. కోడి రామ్మూర్తి జన్మించిన గడ్డపై సగర్వంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నాం. క్రీడాకారులందరికీ రూ.37 కోట్ల విలువైన కిట్లు, విజేతలకు రూ.12.21 కోట్ల బహుమతులు అందజేశాం. అయిదు క్రీడాంశాల్లో అద్భుతంగా రాణించిన 14 మందిని చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ప్రో కబడ్డీ, ఏపీ కబడ్డీ అసోసియేషన్, బ్లాక్ హాక్స్, ఏపీ ఖోఖో, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్లు దత్తత తీసుకున్నాయి. వీరికి సరైన శిక్షణ ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశముంది. వీరందరికీ ఆయా సంస్థలతోపాటు రాష్ట్రప్రభుత్వం తోడుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. అంతకుముందు క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను సీఎం వీక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో ఏర్పాటుచేశారు.
source : eenadu.net
Discussion about this post