గుత్తిలో రైతు నుంచి లంచం తీసుకుంటూ వజ్రకరూరు మండల విద్యుత్తుశాఖ ఏఈ చంద్రశేఖర్ శుక్రవారం అనిశా అధికారులకు చిక్కారు. గుంతకల్లు మండలానికి చెందిన చంద్రశేఖర్ 15ఏళ్ల కిందట విద్యుత్తుశాఖలో చేరారు. గుత్తి, పామిడి, పెద్దవడుగూరులో పని చేశారు. అక్కడి నుంచి వజ్రకరూరు వెళ్లారు. ఆయన ఆది నుంచి అవినీతిని ఎంచుకున్నారు. ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసేందుకు రైతులతో అక్రమ వసూళ్లకు పాల్పడేవారు. వజ్రకరూరుకు చెందిన ఓ రైతు తనకు నియంత్రిక ఇవ్వాలని కోరగా రూ.30వేలు డిమాండు చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని కాళ్లవేళ్లాపడినా కరుణించలేదు. చివరికి రూ.20వేలకు బేరం కుదుర్చుకున్న రైతు.. అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులను ఆశ్రయించారు. అధికారులు పథకం ప్రకారం గురువారం రాత్రి గుత్తిలో వలపన్ని ఏఈని పట్టుకున్నారు. రాత్రంతా ఆయన్ను విచారించి శుక్రవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండు విధించారు. చంద్రశేఖర్ పెద్దవడుగూరులో పని చేసే సమయంలో ఒక చోటకు మంజూరైన విద్యుత్తు సామగ్రిని మరో చోటికి తరలించారు. కాంగ్రెస్ హయాంలో రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన అప్పటి మంత్రి జేసీ దివాకరరెడ్డి ఆయన్ను సస్పెండ్ చేయించారు.
వజ్రకరూరు విద్యుత్తు ఏఈ కార్యాలయం అవినీతికి చిరునామాగా మారింది. అనిశాకు దొరికిన ఏఈ చంద్రశేఖర్ గత రెండేళ్లుగా వజ్రకరూరులో పనిచేస్తున్నారు. ఈ కాలంలో దాదాపు 300కు పైగా విద్యుత్తు నియంత్రికలు మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం చెల్లించిన డీడీ కాకుండా ఒక్కో నియంత్రికకు రైతుల నుంచి రూ.30వేల-రూ.40వేల వరకు అదనంగా వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఆ కేంద్రంలో ప్రైవేటు విధానంలో పనిచేస్తున్న సిబ్బంది వసూలు చేసి అధికారికి అప్పగిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. దీనికి తోడు గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న కొందరు ఎనర్జీ సహాయకులు ఈ అధికారికి దళారులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై తన అక్రమ వసూళ్లు కొనసాగించారన్న వాదన ఉంది. నాయకులను కలవని రైతులకు సకాలంలో నియంత్రికలు, సామగ్రి అందించకుండా వారిని తన కార్యాలయం చుట్టూ తిప్పుకునే వారు. రైతులు ఆ నాయకులను కలిసి కొద్దో గొప్పో డబ్బులు ముట్టిచెప్పినప్పుడే నియంత్రికలను, వాటి సామగ్రిని మంజూరు చేసేవారని చెబుతున్నారు. మండలంలోని పందికుంటకు చెందిన ఓ రైతు, వెంకటాంపల్లి పెద్దతండాకు చెందిన మరో రైతు అధికార పార్టీ నాయకులను కలవకపోవడంతో రెండు సంవత్సరాలుగా వారిని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్న దాఖలాలు ఉన్నాయి.
source : eenadu.net
Discussion about this post