మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. రామగిరి మండలం వెంకటాపురంలోని ఎల్లమ్మ ఆలయంలో, పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి మొదట పూజలు చేశారు. అనంతరం వేలాది కార్యకర్తల నడుమ రామగిరి, ఎన్‌ఎస్‌గేట్, మరూరు టోల్‌గేట్ మీదుగా రాప్తాడు వరకూ పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. కనగానపల్లి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి రామగిరి మండలాల్లో ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు కదిలారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హైవే పక్కన ఏర్పాటు చేసిన సభలో సునీత మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కారణంగా వెళ్లిపోయిన జాకీ పరిశ్రమ స్థానంలో మరికొన్ని తీసుకొస్తామన్నారు. అధికారంలోకి వస్తే పరిటాల, చంద్రబాబు ఆస్తులను పంచుతామని తోపుదుర్తి చెప్పడం కాదని.. చేతనైతే ఒక్కసారి పరిటాల వైపు చూడాలని సవాల్ విసిరారు. రవీంద్ర కాలిగోటికి కూడా సరిపోవని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ఓడిపోతే అర మీసం తీయించుకుంటానని మాటలు చెప్పడం కాదు..అందుకు సిద్ధంగా ఉండాలని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తెదేపా విజయం సాధిస్తుందని ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు.
source : eenadu.net
Discussion about this post