ఆంధ్రాలో అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్తుంటే పచ్చనేతలు, పచ్చ మీడియాకు మాత్రం పచ్చకామెర్లు వచ్చాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. బుధవారం విజయపురం మండలంలోని ఇల్లత్తూరు పంచాయతీలో ఒకే ప్రాంగణంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనం, రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ.20.8 లక్షల వ్యయంతో నిర్మించిన వెల్‌నెస్ సెంటర్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు స్థానిక మహిళలు కర్పూర హారతులు ఇచ్చి, గజమాలతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేసిందన్నారు. నేడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు అభివృద్ధి జరగలేదనడం చూస్తుంటే వారికి భయంకరమైన కొత్త రోగం వచ్చినట్లుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లి అడిగినా అభివృద్ధిని ప్రజలే తీసుకెళ్లి చూపిస్తారన్నారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా సీఎం జగనన్న ప్రజల చెంతకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారని తెలిపారు. ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మరోమారు అండగా నిలవాలని కోరారు. అలాగే ఇల్లత్తూరులో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆర్‌కె రోజా, ఆమె భర్త సెల్వమణి ప్రారంభించారు. అనంతరం రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన ట్యాంక్‌ను ప్రారంభించారు.
source : sakshi.com
Discussion about this post