అశేష ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా అనేక పథకాలను అమలు చేసి ప్రజా సంక్షేమానికి బాటలు వేశారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతికి విచ్చేసిన మంత్రి సంప్రదాయబద్ధంగా గురువారం సాయంత్రం శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. వేయి కళ్ల దుత్తను మంత్రి నెత్తిన పెట్టుకొని ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి పాదాలపై ఉప్పు పోసిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు, సిబ్బంది అమ్మవారి సారె, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కొద్ది నెలల్లోనే కరోనా విపత్తు రావడంతో ప్రపంచం అతలాకుతలమైపోయినా, రాష్ట్రంలో సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొన్న వ్యక్తి జగనన్న అని తెలిపారు. ఇదే సమయంలో వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దళారీలను సమూలంగా అరికట్టి ప్రజల మన్ననలు అందుకున్నారని చెప్పారు. వ్యవసాయం దండగ అని చెప్పిన నాయకులు ఎన్నికల వేళ ప్రజల్లోకి వస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు అందించిన గతంలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని గుర్తుచేశారు. అదేవిధంగా జగనన్నను ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన ధైర్యంతోనే వైఎస్సార్‌సీపీ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తోందన్నారు. జనసేన, టీడీపీ పొత్తు పట్ల విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఒక్కటవుతారని తెలిపారు.
source : sakshi.com
Discussion about this post