‘రాష్ట్రంలోని అయిదు కోట్ల మందినీ అడుగుతున్నా. మీకు విధ్వంసపాలన కావాలా.. అభివృద్ధి రాజ్యం కావాలా? సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా? మీ ఆస్తులకు రక్షణ కావాలా.. వైకాపా భూమాఫియా కావాలా? నడుములు విరిగే రోడ్లు కావాలా.. రహదారి భద్రత కావాలా? రూ.10 ఇచ్చి 100 దోచే దొంగలు కావాలా.. సంపద పెంచే కూటమి కావాలా? తాకట్లతో అప్పులు తెచ్చేవాళ్లు కావాలా.. సంపద సృష్టించేవాళ్లు కావాలా? ధరల బాదుడు కావాలా.. దోపిడీ లేని పాలన కావాలా? దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా.. దళితులను పారిశ్రామికవేత్తలుగా చేసే ప్రభుత్వం కావాలా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మే 13న ఆలోచించుకుని ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజాతీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలన్నారు. ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. నరేంద్ర కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీయే కూటమి ఆక్సిజన్. రాజధాని నిర్మించాలి, పోలవరం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వాలి. ఇవన్నీ జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలి’ అని చంద్రబాబు తెలిపారు.
‘వైకాపా పాలనలో జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు, ఉద్యోగాలు రాలేదు. మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ విడుదల చేస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. సూపర్ సిక్స్ ద్వారా మహిళలు, యువత, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలనూ ఆదుకుంటాను’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
‘జగన్ బోగస్ ప్రచారాలు చేయిస్తారు. సామాజిక మాధ్యమాల్లో పవన్‌కు, నాకు గొడవలు పెట్టేలా పోస్టులు పెట్టిస్తున్నారు. పవన్ స్టేట్‌మెంట్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు వస్తున్న సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలి. దొంగలు పెట్టే ఫేక్‌వార్తలను నమ్మకండి’ అని చంద్రబాబు సూచించారు.
‘అయిదేళ్లలో వైకాపా విధ్వంసం పరాకాష్ఠకు చేరుకుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసి జైల్లో పెట్టారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదన్న సంకల్పంతోనే జట్టుకట్టాం. దానికోసం ఎన్నో విషయాల్లో సర్దుబాటు చేసుకున్నాం. బలమైన వ్యవస్థ ఉన్నా చంద్రబాబు తగ్గారు. నేనూ చాలా విషయాల్లో తగ్గాను. మా అన్నయ్య నాగబాబు సీటునూ వదిలిపెట్టాం. ఇన్ని త్యాగాలు చేసింది కేవలం ప్రజల భవిష్యత్తు కోసమే. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో నాకు బాగా తెలుసు. తణుకులో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా తగ్గానంటే అది మీ కోసమే’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజాగళం ప్రచారయాత్రలో భాగంగా బుధవారం ఆయన తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి తణుకులో పర్యటించారు. స్థానిక ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌లో ఇరు పార్టీల అధినేతలు దిగారు. అప్పటికే హెలిప్యాడ్ సమీపంలో తణుకులో సీటు కోల్పోయిన జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావు వర్గం నిరసన తెలిపింది. వారాహి యాత్ర సమయంలో ఇచ్చిన హామీకి సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించింది. ఇద్దరు నేతలు హెలిప్యాడ్ నుంచి రోడ్డు షోగా నరేంద్ర కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగసభకు తరలివచ్చి వేదికపై ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘పేదవర్గాలు, అల్పాదాయ, పారిశ్రామిక వర్గాలనే కాకుండా.. మధ్యతరగతి ప్రజలను కూడా కూటమి గుండెల్లో పెట్టుకోవాలి. ఒక మధ్యతరగతి మాజీ పోలీసు ఉద్యోగి కుమారుడిగా అడుగుతున్నాను. అసెంబ్లీలో అడుగుపెట్టాక ఉద్యోగుల కోసం ఏడాదిలోపు సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేయాలి’ అంటూ చంద్రబాబుకు పవన్ విన్నవించారు.
source : eenadu.net
Discussion about this post