చిలకలూరిపేట ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంగా గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను వైకాపా రౌడీ మూకలు గొడ్డలితో నరికి చంపాయని, ఆళ్లగడ్డలోని చాగలమర్రిలో ఇమామ్‌హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మాచర్లలో తెదేపా కార్యకర్త సురేశ్ కారును తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి వైకాపాకు అత్యంత అనుకూలమైన వారని… వారి అండ చూసుకొనే అధికార పార్టీ గూండాలు చెలరేగుతున్నారని దుయ్యబట్టారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందూ జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైకాపా మూకలు తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయి. ఈ మూడు ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఈసీ దృష్టి సారించాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘ఎన్డీయే కూటమికి 400కు పైగా లోక్‌సభ స్థానాలు, ఏపీలో 160కి పైగా ఎమ్మెల్యే సీట్లు’ అనే మాట రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించనుంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు’ అని స్పష్టంచేశారు.
తెదేపాకు గుంటుపల్లి నాగేశ్వరరావు ఎనలేని సేవలు చేశారని చంద్రబాబు కొనియాడారు. ఆయన మృతిపై సంతాపం తెలిపారు. నాగేశ్వరరావు కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మొదలు రాష్ట్రస్థాయి వరకు పార్టీలో అనేక పదవుల్ని గుంటుపల్లి అధిరోహించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
source : eenadu.net
Discussion about this post